‘ప్లాస్మా’ పేరుతోనూ మోసాలు | Sakshi
Sakshi News home page

‘ప్లాస్మా’ పేరుతోనూ మోసాలు

Published Tue, Jul 21 2020 8:20 AM

Cyber Criminals Cheating With Plasma Donors Name Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఘరానా మోసగాళ్లు సీజన్‌ను బట్టి తమ పంథా మార్చుకుంటున్నారు. తాజాగా కోవిడ్‌ పేషెంట్స్‌కు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో వైద్యం చేస్తున్నారు. దీంతో ప్లాస్మా డోనర్లకు భారీ డిమాండ్‌ వచ్చింది. దీన్ని కూడా క్యాష్‌ చేసుకోవడానికి మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఈ పంథాలో పలువురిని మోసం చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వాసిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతగాడు కొందరిని యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ఇప్పిస్తానంటూనూ మోసం చేసినట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి సోమవారం వెల్లడించారు. ఇతగాడు ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న దాదాపు 200 మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నామని, నగరంలో ఇతడిపై నాలుగు కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్‌ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఈ కేసుల్లో అరెస్టు అయిన జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు.

తాజాగా కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్‌ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో అనేక మంది సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ కేంద్రంగా డోనర్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గమనించిన సందీప్‌ డోనర్‌ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్‌ చేశాడు. ప్లాస్మా డోనర్స్‌ కోసం వాటిలో ప్రకటనలు ఇచ్చిన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్‌ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్‌గ్రూప్‌ అని నమ్మబలికే వాడు. తాను ప్లాస్మా డొనేట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు.

తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్‌ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కోవిడ్‌ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ఇప్పిస్తానంటూ డబ్బు గుంజాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు. నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్‌తో పాటు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇతడిని పట్టుకోవడానికి ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు గోవింద్‌స్వామి, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇలాంటి మోసగాళ్లు మరికొందరు ఉండి ఉంటారని, అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement