లెక్చరర్‌ తిట్టారని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

CV Raman Junior College Student Suicide - Sakshi

మృతురాలు సీవీ రామన్‌ కళాశాల విద్యార్థిని

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :  ఇంటర్‌ పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని సీవీ రామన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నదీమున్నీసాబేగం(18) లెక్చరర్‌ తిట్టారన్న కారణంతో ఇంటికెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరులోని ఎంఎస్‌ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న సుధాకర్‌బాబు, నూర్జహన్‌బేగం దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. సుధాకర్‌బాబు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి కూతురు తహెరబాను, రెండో కూతురు నదీమున్నీసాబేగం, మూడో కూతురు హజ్‌మున్నీసా బేగం. వీరిలో తహెరబాను ఎంపీసీ, నదీమున్నీసాబేగం బైపీసీ సీవీ రామన్‌ జూనియర్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నారు. 

శుక్రవారం స్టడీ అవర్‌లో ఫిజిక్స్‌ టీచర్‌ సులోచన.. నదీమున్నీసాబేగంకు స్లిప్‌ టెస్టులో తక్కువ మార్కులు రావడంతో తోటి విద్యార్థుల ఎదుట తిట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇంటికి తీసుకెళ్లడానికి అక్క రావడంతో ఆమెతో కూడా నదీమున్నీసాకు చదువు రాదని చెప్పడంతో అవమానంగా భావించింది. ఇంటికి రాగానే చదువుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధ్యాపకురాలు తిట్టడంతోనే తమ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, కారణమైన ఆమెపై, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.  నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top