నాటు బాంబు విసిరి.. కత్తితో దాడి చేసి

Crime News: Two Rowdy Sheeters Brutally Murdered In Tamil Nadu - Sakshi

ఇద్దరు రౌడీషీటర్‌ల దారుణ హత్య  

పన్నూర్‌ వద్ద కలకలం  

రౌడీల మధ్య ఆదిపత్య పోరే హత్యకు కారణం 

నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు  

రెండేళ్లలో 15 హత్యలు

తిరువళ్లూరు: శ్రీపెరంబదూరు నుంచి తక్కోలం వైపు వెళ్తుతున్న ఇద్దరు రౌడీలను ప్రత్యర్థులు కాపు కాచి నాటు బాంబు విసిరి కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పన్నూరు వద్ద శనివారం చోటు చేసుకుంది. కాంచీపురం పట్టణానికి చెందిన బాబు కుమారుడు జీవ(19), రమేష్‌ కుమారుడు గోపి(24). వీరిద్దరూ శ్రీపెరంబదూరు నుంచి తక్కోలం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. పన్నూర్‌ వద్ద ఉన్న స్పీడ్‌ బ్రేక్‌ను దాటే సమయంలో కాపు కాచిన సుమారు 10 మంది ద్విచక్ర వాహనంలో వెళ్తుతున్న ఇద్దరిపై నాటుబాంబులను విసిరారు. బాంబులు వారిపై పడడంతో జీవా, గోపి కిందపడిపోయారు. ఇద్దరినీ కత్తితో ప్రత్యర్థులు దారుణంగా నరికి హత్య చేసి పారిపోయారు.

దుండగులను గ్రామస్తులు పట్టుకోవడానికి యత్నించినా వారు కత్తిని చూపించి పరారైనట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు ఎస్పీ అరవిందన్, శ్రీపెరంబదూరు అసిస్టెంట్‌ ఎస్పీ కార్తికేయన్‌ తిరువళ్లూరు డీఎస్పీ గంగాధరన్‌ నేతృత్వంలోని పోలీసులు భారీగా మోహరించారు. డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ నిపుణులను సంఘటనా స్థలానికి రప్పించి ఆధారాలను సేకరించారు. బాంబు దాడితో ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

హత్యకు ఆధిపత్య పోరే కారణమా? 
పోలీసుల విచారణలో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం జిల్లా కోలాచ్చీకి చెందిన ప్రముఖ రౌడీ శ్రీధర్‌. కాంచీపురం తిరువళ్లూరు తదితర జిల్లాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను బెదిరించి కిడ్నాప్, రియల్‌దందా, పంచాయితీలు, గంజాయి విక్రయం లాంటివి నిర్వహించి డబ్బులు వసూలు చేసేవాడు. శ్రీధర్‌  వ్యవహరాలు పోలీసులకు తలనొప్పిగా మారడంతో మోస్ట్‌వాంటెండ్‌గా ప్రకటించాడు. కాంబోడియా పారిపోయిన శ్రీధర్‌ 2017లో సైనైడ్‌ తీసుకుని అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అతని డ్రైవర్‌ దినేష్, శ్రీధరన్‌ మేనల్లుడు తనికాచలం ప్రయత్నించారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వంద మందితో గ్రూపులను ఏర్పాటు చేసుకుని దందాలు సాగించడం ప్రారంభించారు.

కిడ్నాప్, రియల్‌దందా, పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేసి శ్రీధర్‌ను తలపించేలా వ్యవహరాలను నడిపించడం ప్రారంభించారు. కాంచీపురం పట్టణంలో తరచూ హత్యలు, కిడ్నాప్‌లతో చెలరేగడంతో వీరిని అదుపులోకి తేవడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. కాంచీపురంలో రౌడీషీటర్లుగా చెలామణి అవుతూ అల్లరి సృష్టిస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసి వేలూరు, ఊటి తదితర ప్రాంతాల్లో గాలించినా వారు తృటిలో తప్పించుకుని కర్ణాటకు పరారయ్యారు.  

ఆధిపత్యం కోసం 13 హత్యలు  
తనికాచలం, దినేష్‌ రౌడీలుగా చెలామణి అయిన తరువాత ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి  2017 నుంచి ఇప్పటి వరకు అప్పుకుట్టి డాన్‌మణి, కరుణాకరన్, సతీష్‌కుమార్‌తో సహా రెండు వర్గాలకు చెందిన 13 మంది  హత్యకు గురయ్యారు. ప్రస్తుతం జీవా, గోపి హత్యతో 15కు చేరింది. ఇదివుండగా రెండు నెలల క్రితం తనికాచలం వర్గానికి చెందిన కరుణాకరన్‌ను దినేష్‌ త్యాగు మరో పది మంది కలిసి హత్య చేశారు. వీరిలో త్యాగు, దినేష్‌ పోలీసులకు పట్టుబడి జైలులో రిమాండ్‌గా ఉంటున్నారు. తమ వర్గానికి చెందిన కరుణాకరన్‌ను దినేష్‌ వర్గీయులు హత్య చేయడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి తనికాచలం గ్రూపునకు చెందిన చిన్న హరికృష్ణన్, షణ్ముగం, గోపి , జీవ రెండు రోజుల క్రితం కత్తులు, బాంబులో కాంచీపురంలో నానారభస సృష్టించారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకుని చిన్న, హరికృష్ణన్, షణ్ముగంను అరెస్టు చేయగా, గోపి, జీవా తప్పించుకున్నారు. దినేష్‌ వర్గీయులపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గోపి, జీవా నుంచి తమకు ముప్పు ఉంటుందని గ్రహించిన దినేష్‌ వర్గీయులు శనివారం తిరువళ్లూరు, పన్నూరు వద్ద కాపుకాచి ఇద్దర్నీ హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ఎస్పీ అరవిందన్‌ హత్యల్లో పాల్గొన్న వారిని వేగంగా పట్టుకోవాలని ఆదేశించారు. మొత్తానికి తిరువళ్లూరులో శనివారం ఉదయం జరిగిన బాంబుల దాడి ఇద్దరి హత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top