తీగలాగితే డొంక కదిలింది

Cricket Betting Gang Arrest in Guntur - Sakshi

క్రికెట్‌ బెట్టింగ్‌ అనేక మంది జీవితాలను నాశనం చేసింది. ఎందరో యువకులు సర్వం కోల్పోయి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడిన మధ్యప్రదేశ్‌ యువకులను విచారిస్తే కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా 220 మందికిపైగా బుకీలు ఉన్నట్లు గుర్తించారు. బుకీలను అరెస్టు చేసేందుకు రూరల్‌ ఎస్పీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. మిగిలిన రాష్ట్రాల పోలీసులతో సంప్రదించి బెట్టింగ్‌ ముఠాల గుట్టురట్టు చేసేందుకు సిద్ధమయ్యారు.

గుంటూరు: యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ ఆన్‌లైన్‌లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న జిల్లాకు చెందిన బుకీతో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులను గుంటూరు రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అంకిత్‌ ద్వివేది, అవదీష్‌ ప్రతాప్‌సింగ్, దివ్యాంషు సింగ్‌లను అదుపులోకి తీసుకొని, 5న రాజపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి నాగార్జునలను  అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఐపీఎల్‌ క్రికెట్‌ ప్రారంభం నుంచి జిల్లాలో బెట్టింగ్‌లు కొనసాగుతున్న సంఘటనలు ఎస్పీ రాజశేఖరబాబు దృష్టికి వెళ్లడంతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బుకీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పరారీలో ఉన్న కలకత్తాకు చెందిన ప్రధాన బుకీ వద్ద నుంచి నాగార్జున ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో లింక్‌లను తీసుకొని వాటిని బెట్టింగ్‌ రాయుళ్లకు షేర్‌ చేస్తూ వాటి ద్వారా బెట్టింగ్‌లు నిర్వహించాడు.

రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌ బృందం...
సత్తెనపల్లి కేంద్రంగా కొనసాగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో నాగార్జున బెట్టింగ్‌లో తనకు ఇవ్వాల్సి ఉన్న రూ 6 వేలు ఇవ్వలేదంటూ సత్తెనపల్లికి చెందిన అంకళ్ల ఉదయభాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌ బృందానికి అప్పగించారు. దీంతో వరుసగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దైన శైలిలో విచారణ చేపట్టడంతో పలు ఆసక్తి కర విషయాలు వెలుగు చూడటంతో అవాక్కవడం వారి వంతైంది. ఖాకీ  సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 226 మంది బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు తేల్చారు. వెంటనే ప్రధాన నిందుతుడైన నాగరాజు బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలించి అతని ఖాతాలో ఉన్న రూ. 22,16 లక్షల నగదును సీజ్‌ చేశారు.

విడివిడిగా విచారణలో....
విచారణలో భాగంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులను విడివిడిగా విచారణ చేపట్టడంతో పొంతన లేని సమాదానాలు చెప్పడంతో మరింత లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయాలు రాబట్టారు. ముగ్గురు నిందితుల వాట్సాప్, ఫేస్‌బుక్‌ లను పరిశీలించి వారి వద్ద ఉన్న బుకీల ఫోను నెంబర్లను వారి అడ్రస్‌లను  పరిశీలిస్తే దాదాపుగా దేశ వ్యాప్తంగా బుకీలు వీరి పరిధిలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునతో పాటు ఇంకా బుకీలు ఉండటంతో పాటు దేశ వ్యాప్తంగా 220 మంది ప్రధాన బుకీలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. బెట్టింగ్‌ రాయుళ్ల సంగతికి వస్తే వేలాదిగా ఉన్నట్లు గుర్తించారు.

డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లిన ఎస్పీ...
క్రికెట్‌ బెట్టింగ్‌ మహమ్మారి  పునాదులను జిల్లాలో కూడా పోలీసులు గుర్తించడంతో జిల్లాలో ఉన్న బుకీలందరూ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల  ప్రకారం బుకీలను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో ప్రత్యేకంగా గాలింపు చర్యలు ప్రారంబించారు. విచారణలో తీగ లాగితే డొంక కదలడంతో దేశ వ్యాప్తంగా బుకీలు ఉన్నట్లు గుర్తించిన ఎస్పీ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లారు. మిగిలిన రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని తెలిసింది. మరోసారి జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నలుగురి పోలీస్‌ కష్టడీకి తీసుకొని విచారణ చేపట్టేందుకు సిద్దం అయ్యారు. టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు బుకీల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

సాధ్యం అయ్యేనా...
ఖాకీ సినిమాను తలపించేలా దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలను గుర్తించి వారిని అరెస్టు చేయడం రాష్ట్ర పోలీసులకు సవాలుగా నిలిచింది. పక్క రాష్ట్రం నుంచి నిందితులను అరెస్టు చేయాలంటే డీజీపీ అనుమతితో ఎస్పీ ఫారన్‌ పాస్‌పోర్టు జారీ చేయాల్సి ఉంటుంది. విడతల వారీగా చేపట్టినా అందరినీ అరెస్టు చేయాలంటే దాదాపుగా ఏడాది సమయం పడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు.
ఇదంతా సాధ్యం అవుతుందా? లేక పోతే మమ  అనిపిస్తారా? అనే సందేహాలు పోలీస్‌శాఖలో ఉన్నాయి. ఏదిఏమైనా పోలీస్‌బాస్‌ ప్రత్యేక దృష్టి సారిస్తేనే సాధ్యం అవుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top