వైఎస్‌ షర్మిల ఫిర్యాదు: రిమాండ్‌కు మరో నిందితుడు

Court Sends Accused On Judicial Remand In YS Sharmila Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో... హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అరెస్టు చేసిన మంచిర్యాల జిల్లా రామ్‌నగర్‌కు చెందిన అడ్డూరి నవీన్‌ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ షర్మిలను అప్రదిష్ట పాలుచేసేందుకు కుట్ర చేసిన కారణంగా అతనిపై సెక్షన్‌ 509 ఐపీఎస్‌, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో శనివారం పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసి పోస్టులపై ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు తీవ్ర అసభ్యకర కామెంట్లు చేశాడు. ఆదివారం అరెస్టయిన నవీన్‌ నాలుగు వీడియోల కింది భాగంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా క్షురకుడైన ఇతను ఎందుకు అభ్యంతరకర కామెంట్లు చేశాడనే అంశాన్ని ఆరా తీస్తున్నారు.

ఈ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూ–ట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసి వివరాలు, పదేపదే కామెంట్లు పెట్టిన వారి మూలాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏ ఐపీ (ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌) అడ్రస్‌ ఆధారంగా ఇంటర్‌నెట్‌ను యాక్సిస్‌ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్‌ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ కేసులో వీడియోలు పోస్ట్‌ చేసిన వారితోపాటు కామెంట్లు చేసిన వారూ నిందితులుగా మారతారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 18 మందికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top