ముందుగా భర్తని.. ఆ తర్వాత భార్యని..!

Couple brutally murdered in Prakasam district

ఒంగోలు: వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు.

ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. బంగారపు కడ్డీలు తక్కువ ధరకు వస్తున్నాయని తనకు తెలిసిన వారు చెప్పారంటూ బుడబుక్కల శ్రీనివాసులు ఇటీవల పల్లపోతు శ్రీనివాసులుతో చెప్పాడు. ఆ మాటలు నమ్మిన పల్లపోతు శ్రీనివాసులు ఆయనకు రూ.15 లక్షలిచ్చాడు. అయితే బంగారపు కడ్డీలు తీసుకొస్తానని వెళ్లిన బుడబుక్కల శ్రీనివాసులు వాటిని ఇవ్వలేదు. దీంతో తన డబ్బు తనకివ్వాలంటూ వ్యాపారి ఒత్తిడి పెంచాడు.
 

ముందుగా భర్తని.. ఆ తర్వాత భార్యని..!
ఈ క్రమంలో 28వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో కారులో వచ్చిన బుడబుక్కల శ్రీను డబ్బులిస్తానంటూ పల్లపోతు శ్రీనివాసులును వెంట తీసుకెళ్లాడు. కారులోనే మరికొందరితో కలిసి శ్రీనివాసులును హత్యచేశాడు. ఆ తర్వాత అదే కారులో వచ్చి అతడి భార్య ప్రమీలాదేవి(35)ని కూడా భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి హత్యచేశాడు. పల్లపోతు శ్రీనివాసులు, ప్రమీలారాణి సెప్టెంబర్‌ 28న రాత్రి నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబసభ్యులు 30న ఒంగోలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

టూటౌన్‌ ఎస్‌ఐ కేశన వెంకటేశ్వరరావు అదేరోజు కేసు నమోదుచేశారు. జిల్లా ఎస్పీ బి.సత్యఏసుబాబు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ సీఐ ఎండీ ఫిరోజ్‌తో పాటు ప్రత్యేక పోలీస్‌ బృందాలతో దంపతుల అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించారు. బుడబుక్కల శ్రీనివాసులే దంపతులను 28వ తేదీ రాత్రి హత్యచేసి ఒంగోలు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌–1కు పడమర బైపాస్‌కు సమీపంలోని చెట్లలో పూడ్చి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు నిందితులను మంగళవారం రాత్రి మార్కాపురం ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను బయటకు తీయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top