‘దృశ్యం’ సినిమా చూపించారు!

Congress leader Twinkle Dagre's murder was inspired by Drishyam movie - Sakshi

ఇండోర్‌: సినిమాల ప్రభావం జనంపై ఉంటుందా అన్న ప్రశ్నకు ఇదొక ఉదాహరణ. దృశ్యం సినిమాను రియల్‌ లైఫ్‌లో దించేశారు. ట్వింకిల్‌ దగ్రే (22) అనే మహిళ రెండేళ్ల కింద కనిపించడం లేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేసు నమోదైంది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. ఈ కేసులో నిందితులు బీజేపీ మాజీ కార్పొరేటర్‌ జగదీశ్‌ కరొటియా (65), అతని ముగ్గురు కుమారులు అజయ్‌(38), విజయ్‌ (36), వినయ్‌ (31)తో పాటు వీరి సహాయకుడు నీలేశ్‌ కశ్యప్‌(28)ని అరెస్టు చేసినట్లు ఇండోర్‌ డీఐజీ హరినారాయణచారి మిశ్రా వెల్లడించారు. దృశ్యం సినిమా ప్రేరణతో వారు ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

వివాహేతర సంబంధమే: కరొటియాకు ట్వింకిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె అతనితోనే ఉంటానని పట్టుబట్టడంతో కరొటియా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె అడ్డు తప్పించాలని భావించిన కరొటియా..తన ముగ్గురు కొడుకులతో కలసి హత్యకు పథకం వేశాడు.

దారి మళ్లించారిలా..
► ఐదుగురు కలసి 2016 అక్టోబర్‌ 16న ట్వింకిల్‌ గొంతు నులిమి చంపి..కరొటియా స్థలంలోనే మృతదేహాన్ని కాల్చేశారు.
► ట్వింకిల్‌ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని నమ్మించడానికి హత్యకు ముందురోజు నిందితుడు అజయ్‌ ట్వింకిల్‌ మొబైల్‌ తీసుకుని ‘నా తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను కాపాడు’అంటూ వాట్సప్‌ నుంచి తన తండ్రికి సందేశాలు పంపించుకున్నాడు.
► హత్య చేసిన రోజే ఓ కుక్కను చంపి ఆమెను కాల్చిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో పూడ్చిపెట్టారు.
► అదే రోజు ట్వింకిల్‌ మొబైల్‌ లొకేషన్‌ మార్చి బాదన్వర్‌ సమీపంలో పూడ్చిపెట్టారు.
► అనంతరం 4 నెలలకు తన భూమిలో ఎవర్నో చంపి పూడ్చి పెట్టారని, కొలతలను బట్టి చూస్తుంటే అది ట్వింకిల్‌ మృతదేహం లాగే ఉందని స్థానికంగా వదంతులు సృష్టించి చర్చనీయంశం చేశాడు. అనంతరం 2 నెలలకు ఈ విషయాన్ని తన సహాయకుడి ద్వారా పోలీసులకు చేరవేశాడు.
► అక్కడ తవ్వి చూసిన పోలీసులకు దృశ్యం సినిమా మాదిరి కుక్క కళేబరం బయటపడింది. ఇది దర్యాప్తును పక్కదారి పట్టించింది.
► కరొటియా సూచనల మేరకు అంతకు ముందే ట్వింకిల్‌ తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసింది. ఇది ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసుల్ని దారి మళ్లించింది.

సాక్షులూ..ఆధారాలతో..
కొన్నాళ్లకు మృతదేహాన్ని కాల్చిన ప్రదేశంలో ట్వింకిల్‌కు సంబంధించిన ఒక జత మెట్టెలు, ఓ బ్రాస్‌లెట్, అస్థికలు, ఆమెను చంపడానికి ఉపయోగించిన తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరొటియాపై అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్‌ 16న కార్‌లో ఓ మృతదేహం తెచ్చారని, దాని గురించి అడిగితే కార్పొరేటర్‌ కుక్క చనిపోయిందని, దాన్ని పూడ్చిపెట్డడానికి తీసుకెళ్తున్నట్లు కరొటియా సహాయకుడు సూర్యవంశీ ద్వారా పోలీసులు రాబట్టారు. అంతకు ముందు రోజు ట్వింకిల్‌ ఆ ఇంటికి వచ్చినట్లు కూడా అతను చెప్పాడు. చనిపోయిన కుక్కకోసం తమను 5 అడుగుల గొయ్యి తవ్వమన్నారని ఐఎంసీ కార్మికులు పోలీసులకు చెప్పడంతో వారి అనుమానం నిజమైంది.

బయటపడింది ఇలా..
ఈ కేసుకోసం ఇండోర్‌లోనే తొలిసారి నిందితునికి బ్రెయిన్‌ ఎలక్ట్రికల్‌ ఆసిలేషన్‌ సిగ్నేచర్‌ (బీఈఓఎస్‌) పద్ధతిలో దర్యాప్తు చేశారు. గుజరాత్‌ లాబొరేటరీలో కరొటియా, అతని ఇద్దరి కుమారులకు ఈ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ పరీక్ష నిర్వహించారు. న్యూరో సైకలాజికల్‌ టెక్నిక్‌ వల్ల దోషులు దొరికిపోవడంతో కథ పూర్తయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top