breaking news
Former corporator
-
‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే.. ’
గాందీనగర్(విజయవాడసెంట్రల్): ‘సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. ఏం చేస్తాం? ఒక పక్క నుంచి పీక్కుంటూ వస్తున్నాం. ఒకరా.. ఇద్దరా ఆపడానికి. వారం ఆగితే అందరినీ రిమూవ్ చేస్తాం. వారం పదిరోజుల్లో మొత్తాన్ని తీసి పారనూకుతాం. వాళ్లిష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ పోయారు. మనోళ్లకు రాలేదు. వాడి మీద ఫిర్యాదు పెట్టు.. వాడి జాబ్ తీయించి పారనూకుతాను’ అంటూ సచివాలయ ఉద్యోగుల గురించి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆ పార్టీ కార్యకర్తతో చేసిన ఫోన్ సంభాషణ. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుట్రలో భాగంగానే హల్చల్పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కిషోర్ మాజీ కార్పొరేటర్ రామయ్యకు ఫోన్ చేసి.. వరద నష్ట పరిహారం అందలేదని చెప్పాడు. ఫలానా వాళ్లకు రూ. 1.25లక్షలు పడ్డాయి. మన వాళ్లు మొత్తం కోల్పోయినా రూ. 3వేలు పరిహారం ఇచ్చారంటూ రామయ్యతో ఫోన్లో మాట్లాడాడు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి రూ. లక్ష, రెండు లక్షలు వేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఏమీ ఇవ్వలేదు. ఇదేం న్యాయమంటూ రామయ్యను అడిగాడు. దీంతో రామయ్య ఒక్కసారిగా.. సచివాలయ బ్యాచ్ మొత్తం వైసీపీ వాళ్లేనంటూ రెచ్చిపోయాడు. ఫోన్ సంభాషణతో నియోజకవర్గంలోని సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ సంభాషణలో వాడిన భాష, సచివాలయ ఉద్యోగులను వాడు వీడు అంటూ మాట్లాడిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి ఆడియోలు రికార్డు చేసి వాటిని వైరల్ చేయడం రామయ్యకు అలవాటేనని, సచివాలయ ఉద్యోగులంతా వైఎస్సార్ సీపీ వాళ్లేనంటూ బెదిరించి వారిని తన ఆధీనంలో పెట్టుకునే కుట్రలో భాగంగానే ఆడియో వైరల్ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో వాళ్ల పార్టీ నాయకులు ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియోలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయని నాయకులు చర్చించుకుంటున్నారు. -
కమిషనర్, మాజీ కార్పొరేటర్ మధ్య వివాదం
కాకినాడ: నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి మధ్య చోటు చేసుకున్న సంవాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తన ఇంటి సమీపంలో గబ్బిలాలు తిరుగుతున్నాయంటూ ఫోన్ చేసిన మాజీ కార్పొరేటర్.. తనను దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించారని కమిషనర్ కె.రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ తనపై దాడి చేశారంటూ మాజీ కార్పొరేటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్‌కు చంద్రమౌళి ఫోన్ చేశారు. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గబ్బిలాలు తిరుగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్ అసహనంతో తనను, తన కుటుంబ సభ్యులను కించపరిచేలా దుర్భాషలాడరని కమిషనర్ చెబుతున్నారు. ఆ తరువాత కూడా రాత్రి పదేపదే చంద్రమౌళి తనకు ఫోన్లు చేశారని కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో మాజీ కార్పొరేటర్ ఇంటి వద్దకు కమిషనర్ రమేష్ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. తన ఇంటికి వచ్చిన కమిషనర్, దాడి చేసి కొట్టారంటూ చంద్రమౌళి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర ఎన్జీఓ సంఘ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కమిషనర్ రమేష్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైతే మున్సిపల్ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్నారని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాజీ కార్పొరేటర్ వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రమౌళి మాట్లాడుతూ తన ఇంటికి వచ్చి దాడి చేసి గాయపర్చిన కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జీజీహెచ్‌లో మాజీ కార్పొరేటర్‌ను ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ పరామర్శించారు. -
మహిళపై మాజీ కార్పొరేటర్ దాడి
సాక్షి, కరీమాబాద్: నగరంలోని 9వ డివిజన్ ఖిలావరంగల్ మద్యకోటలో సోమవారం భూ వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మద్య గొడవ జరగడంతో మహిళకు గాయాలయ్యాయి. మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం. ఖిలావరంగల్ మద్యకోటలోని వాకింగ్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఎకరం స్థలం తమదంటే తమదని మాజీ కార్పొరేటర్ కొప్పుల శ్రీనివాస్, ముప్ప శ్రీలత గొడవలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో శ్రీలత ఆమె భర్త సోమవారం వివాదాస్పద స్థలంలోని పంటపొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొప్పుల శ్రీనివాస్‌కు ముప్ప శ్రీలతలకు మద్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్ శ్రీలతను కర్రతో కొట్టడంతో తలకు గాయమైంది. ఈ గొడవలో మరో వ్యక్తికి కూడా గాయమైంది. తీవ్రంగా గాయపడిన శ్రీలతతో పాటు ఆమె సంబందీకులు మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం గాయాలైన శ్రీలతను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించి.. దాడికి పాల్ప డిన కొప్పుల శ్రీనివాస్‌పై, అతనితో ఉన్న కొప్పుల మొగిలీపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసును ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు. -
‘దృశ్యం’ సినిమా చూపించారు!
ఇండోర్: సినిమాల ప్రభావం జనంపై ఉంటుందా అన్న ప్రశ్నకు ఇదొక ఉదాహరణ. దృశ్యం సినిమాను రియల్ లైఫ్‌లో దించేశారు. ట్వింకిల్ దగ్రే (22) అనే మహిళ రెండేళ్ల కింద కనిపించడం లేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కేసు నమోదైంది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు. ఈ కేసులో నిందితులు బీజేపీ మాజీ కార్పొరేటర్ జగదీశ్ కరొటియా (65), అతని ముగ్గురు కుమారులు అజయ్(38), విజయ్ (36), వినయ్ (31)తో పాటు వీరి సహాయకుడు నీలేశ్ కశ్యప్(28)ని అరెస్టు చేసినట్లు ఇండోర్ డీఐజీ హరినారాయణచారి మిశ్రా వెల్లడించారు. దృశ్యం సినిమా ప్రేరణతో వారు ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. వివాహేతర సంబంధమే: కరొటియాకు ట్వింకిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె అతనితోనే ఉంటానని పట్టుబట్టడంతో కరొటియా ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె అడ్డు తప్పించాలని భావించిన కరొటియా..తన ముగ్గురు కొడుకులతో కలసి హత్యకు పథకం వేశాడు. దారి మళ్లించారిలా.. ► ఐదుగురు కలసి 2016 అక్టోబర్ 16న ట్వింకిల్ గొంతు నులిమి చంపి..కరొటియా స్థలంలోనే మృతదేహాన్ని కాల్చేశారు. ► ట్వింకిల్‌ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని నమ్మించడానికి హత్యకు ముందురోజు నిందితుడు అజయ్ ట్వింకిల్ మొబైల్ తీసుకుని ‘నా తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను కాపాడు’అంటూ వాట్సప్ నుంచి తన తండ్రికి సందేశాలు పంపించుకున్నాడు. ► హత్య చేసిన రోజే ఓ కుక్కను చంపి ఆమెను కాల్చిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో పూడ్చిపెట్టారు. ► అదే రోజు ట్వింకిల్ మొబైల్ లొకేషన్ మార్చి బాదన్వర్ సమీపంలో పూడ్చిపెట్టారు. ► అనంతరం 4 నెలలకు తన భూమిలో ఎవర్నో చంపి పూడ్చి పెట్టారని, కొలతలను బట్టి చూస్తుంటే అది ట్వింకిల్ మృతదేహం లాగే ఉందని స్థానికంగా వదంతులు సృష్టించి చర్చనీయంశం చేశాడు. అనంతరం 2 నెలలకు ఈ విషయాన్ని తన సహాయకుడి ద్వారా పోలీసులకు చేరవేశాడు. ► అక్కడ తవ్వి చూసిన పోలీసులకు దృశ్యం సినిమా మాదిరి కుక్క కళేబరం బయటపడింది. ఇది దర్యాప్తును పక్కదారి పట్టించింది. ► కరొటియా సూచనల మేరకు అంతకు ముందే ట్వింకిల్ తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. ఇది ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసుల్ని దారి మళ్లించింది. సాక్షులూ..ఆధారాలతో.. కొన్నాళ్లకు మృతదేహాన్ని కాల్చిన ప్రదేశంలో ట్వింకిల్‌కు సంబంధించిన ఒక జత మెట్టెలు, ఓ బ్రాస్లెట్, అస్థికలు, ఆమెను చంపడానికి ఉపయోగించిన తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరొటియాపై అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 16న కార్లో ఓ మృతదేహం తెచ్చారని, దాని గురించి అడిగితే కార్పొరేటర్ కుక్క చనిపోయిందని, దాన్ని పూడ్చిపెట్డడానికి తీసుకెళ్తున్నట్లు కరొటియా సహాయకుడు సూర్యవంశీ ద్వారా పోలీసులు రాబట్టారు. అంతకు ముందు రోజు ట్వింకిల్ ఆ ఇంటికి వచ్చినట్లు కూడా అతను చెప్పాడు. చనిపోయిన కుక్కకోసం తమను 5 అడుగుల గొయ్యి తవ్వమన్నారని ఐఎంసీ కార్మికులు పోలీసులకు చెప్పడంతో వారి అనుమానం నిజమైంది. బయటపడింది ఇలా.. ఈ కేసుకోసం ఇండోర్‌లోనే తొలిసారి నిందితునికి బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్ సిగ్నేచర్ (బీఈఓఎస్) పద్ధతిలో దర్యాప్తు చేశారు. గుజరాత్ లాబొరేటరీలో కరొటియా, అతని ఇద్దరి కుమారులకు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించారు. న్యూరో సైకలాజికల్ టెక్నిక్ వల్ల దోషులు దొరికిపోవడంతో కథ పూర్తయింది. -
టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇంట్లో సిట్ సోదాలు
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగో వార్డు టీడీపీ మాజీ కార్పొరేటర్ సోంబాబు ఇంట్లో ఈ దాడులు జరిగాయి. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూ ఆక్రమణలకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. -
చిల్లర సమస్యతోచిరు వ్యాపారుల ఇబ్బంది
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చార్మినార్: చిల్లర సమస్యతో చిరు వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం పాతబస్తీ ఖాద్రీ కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాజీవ్ సేవా సమితి అధ్యక్షుడు, చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటేశ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షమీమ్ సుల్తానా, మాజీ కార్పొరేటర్ మహ్మద్ మేరాజ్ పాల్గొన్నారు. -
ఇదేం..కక్కుర్తి..?
జీహెచ్ఎంసీ సామగ్రి ఇంటికి పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు మాజీ ఫ్లోర్‌లీడర్ నిర్వాకంపై విచారణకు ఆదేశించిన సోమేశ్‌కుమార్ ఆయన తాజా మాజీ కార్పొరేటర్.. జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్షానికి ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు.. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ఎదురే లేదు. సర్వసభ్య సమావేశాల్లో అందరిదీ ఒక ఎత్తయితే ఆయనది ఒక ఎత్తు. ఆయన నోటికి జడిసి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మాట వినని అధికారులను లక్ష్యంగా చేసుకొనేవారు. సర్వసభ్య సమావేశంలో నిలదీసేవారు. అందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టేవారు కూడా. ఇది నాణేనికి ఒక వైపు. మరోవైపు తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు పనులు ద క్కేలా చేసేవారు.. పలు విభాగాల్లో పనులు చేయించుకోవడంలో నేర్పరి. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనులు చేయించడంలోనూ అందెవేసిన చేయి. ఇలా వివిధ మార్గాల్లో పదవిని బాగా వినియోగించుకున్నారు. పదవి నుంచి దిగిపోయే ముందూ కక్కుర్తిపడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్లీ ఫ్లోర్‌లీడర్ హోదాలో జీహెచ్ఎంసీ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక చాంబర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ఫర్నిచర్, టీవీ, ఫ్రిజ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసింది. సాధారణంగా పదవి దిగిపోయేముందు వాటిని సంబంధిత మెయింటనెన్స్ విభాగానికి అప్పగించాలి. అయితే అలా జరగలేదు. ఈ నెల 3న కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోయింది. ఆరోజు తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో కొంతమంది గుంపుగా ఆయన చాంబర్లోకి వెళ్లి టేబుల్, కుర్చీలు, టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అడ్డుకోబోయిన సెక్యూరిటీని గద్దించారు. ‘మా అన్న సింగిరెడ్డి పంపాడు.. మాకే అడ్డుచెబుతావా’ అంటూ గద్దించారు. సెక్యూరిటీ సిబ్బంది సామగ్రి వివరాలు నోట్ చేసుకున్నారు. వచ్చినవారు దర్జాగా వాటిని వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది మెయింటనెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు. మౌనం వహించారు. శుక్రవారం టీడీపీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ‘జీహెచ్ఎంసీ ఫర్నిచర్’ను ఎత్తుకుపోయారంటూ టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విచారణ జరపాల్సిందిగా జీహెచ్ఎంసీ విజిలెన్స్, పరిపాలన విభాగం, ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సామగ్రికి సంబంధించిన రికార్డులు ఎవరు నిర్వహించాలి.. ఈ ఘటనలో ఎవరి బాధ్యత ఎంత.. తదితర వివరాలతో సహ పూర్తి సమాచారం అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఫ్లోర్ లీడర్‌తో ఎందుకొచ్చిన గొడవనుకొని తీసుకువెళ్లిన సామగ్రిని తిప్పి పంపించాల్సిందిగా కొందరు అధికారులు ఆయనను కోరినట్లు తెలిసింది. ‘ఎవరు ఎత్తుకెళ్లారో తెలియదు. నాకు సంబంధం లేదు. కావాలంటే అందుకయ్యే ఖర్చు ఎంతో చెల్లిస్తా’ అని ఆయన అధికారులతో అన్నట్టు తెలిసింది. అందుకు అధికారులు నిరాకరించారు. సామగ్రిని తిరిగి ఇవ్వాల్సిందేనంటూ సిబ్బందిని ఆయన ఇంటికి పంపించారు. సింగిరెడ్డి ఇంటి ముందు మీడియా ప్రతినిధులు ఉండడంతో సిబ్బంది వెనుదిరిగినట్టు సమాచారం. ‘గతంలో ఎవ్వరూ సామాన్లు తీసుకెళ్లలేదా..? నాగురించే ఎందుకు ప్రచారం చేశారు’ అంటూ శ్రీనివాసరెడ్డి కొందరు ఉద్యోగులతో ఫోన్లో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సెక్యూరిటీ, మెయింటనెన్స్ విభాగాల వారు ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు. అధికారులు కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించనున్నట్టు తెలిసింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు రిఫ్రిజిరేటర్, టీవీ, టేబుల్, కప్బోర్డు, 12 ప్లాస్టిక్ కుర్చీలు, మరో ఖరీదైన కుర్చీ తరలించినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో ఇతర ఫ్లోర్‌లీడర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరుల చాంబర్లలోని ఫర్నిచర్ సరిగ్గా ఉందా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నాకు తెలియదు.. సామగ్రి తరలింపుపై సింగిరెడ్డిని వివరణ కోరగా, వాటిని ఎవరు ఎత్తుకెళ్లారో తనకు తెలియదన్నారు. వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు.