కీచక గురువు..

College Principal Molested Students In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించాడు. విద్యార్థులను మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడగా వారు కుటుంబ సభ్యులకు గోడు వెల్లబోసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని రైతుబజార్‌ ఎదుట గల క్రీసెంట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రఫీ విద్యార్థినులను వేధింపులకు పాల్పడుతున్నట్లు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో బాధిత విద్యార్థినులు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కళాశాల ఎదుట సైతం ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులు, వారి బంధువులను సముదాయించారు. విద్యార్థినులను వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

కళాశాలకు రానివ్వకుండా..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని నెలరోజులుగా కళాశాలకు రానివ్వకుండా ప్రిన్సిపల్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తరచుగా ఫోన్‌ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని,   పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురును మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతోపాటు అదే కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వేధింపులకు పాల్పడుతున్నారని, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు..
ఇటీవల మహిళలపై అత్యాచారం, హత్యలు చోటుచేసుకుంటున్న సందర్భంలో సరస్వతీ నిలయాల్లోనూ విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రీసెంట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రఫీపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు, విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు సెక్షన్‌ 354, 12పోక్సో కేసులను నమోదు చేసినట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

                      కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు,  తల్లిదండ్రులు 

విద్యార్థి సంఘాల ఆందోళన..
విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్, కళాశాల కరస్పాండెంట్‌ బిలాల్, అతని సోదరుడు జలాల్‌పై కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. క్రీసెంట్‌ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థినులను వేధించిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top