
చెన్నై, తిరువొత్తియూరు: తండ్రి మద్యం మత్తులో ఉండగా చిన్నారికి బిస్కెట్టు ఇచ్చి కిడ్నాప్ చేసిన సంఘటన గురువారం శ్రీపెరంబుదూరులో సంచలనం కలిగించింది. శ్రీ పెరంబుదూరు, పాలూర్ సమీపం సేందమంగళం పొన్నియమ్మన్ కోయిల్ వీధికి చెందిన కుమరప్రశాంత్. అతని భార్య మురుగమ్మాల్. వీరి కుమారుడు కుమరగురు (5), కుమర ప్రశాంత్‌కు మద్యం తాగుడు అలవాటు ఉంది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఓరగడం సమీపంలో ఉన్న టాస్మాక్ దుకాణానికి కుమరప్రశాంత్ తన కుమారుడితో వెళ్లాడు.
చిన్నారిని బయట ఉంచి మద్యం తాగడానికి దుకాణంలోకి వెళ్లాడు. చాలా సమయం అయినప్పటికీ కుమారుడితో వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో మురుగమ్మాల్ అతన్ని వెతుక్కుంటూ మద్యం దుకాణం వద్దకు వచ్చారు. ఆ సమయంలో కుమరప్రశాంత్ మద్యం మత్తులో పడి ఉండగా చిన్నారి అదృశ్యమయ్యాడు. దీనిపై మురుగమ్మాల్ ఓరగడం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసు అదనపు సూపరింటెండెంట్ రాజేష్ ఖన్నా ఆదేశం మేరకు ఇన్‌స్పెక్టర్ నటరాజన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాను తనిఖీ చేయగా పంచ, చొక్కా ధరించిన గుర్తు తెలియని యువకుడు చిన్నారి కుమరగురుకు బిస్కెట్టు ఇచ్చి తీసుకెళుతున్నట్టు నమోదై ఉంది. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.