రుణాల పేరుతో ఘరానా మోసం

cheting with state bank loans named in ananthapur - Sakshi

రూ.5వేలు కడితే రూ.లక్ష దాకా రుణం

ఉరవకొండ వృద్ధులు, వితంతువులకు ఎర

వసూలైన సొమ్ముతో దుండగుడు ఉడాయింపు

లబోదిబోమన్న బాధితులు.. కేసు నమోదు చేయని పోలీసులు

‘మీరు రూ.5 వేలు కడితే చాలు లక్ష రూపాయల దాకా బ్యాంకులో రుణం ఇప్పిస్తా. మళ్లీ కట్టాల్సిన పనిలేదు. రుణమాఫీ చేయిస్తా’ అని నమ్మబలుకుతూ వృద్ధులు, వితంతువులను నిలువునా మోసం చేసిన ఘరానా మోసగాడి ఉదంతం వెలుగుచూసింది. ఎంతో ఆశతో ఉరవకొండ నుంచి అనంతపురానికి వచ్చిన మహిళలు కనీసం చార్జీలకు డబ్బులు లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు.  

అనంతపురం సెంట్రల్‌: ఉరవకొండ పట్టణానికి చెందిన 14 మంది వృద్ధులు, వితంతువులు ఓ ఘరానా మోసగాని చేతిలో తీవ్రంగా నష్టపోయారు. ఒక్కొక్కరు రూ. 5 వేలు కడితే రూ. 50 వేలు నుంచి రూ. లక్ష వరకూ స్టేట్‌ బ్యాంకులో రుణం మంజూరు చేయిస్తానని వెంకటరమణ అనే వ్యక్తి నమ్మబలికాడు. అదీ వృద్ధులు, వితంతువులకు మాత్రమే బ్యాంకులో రుణం మంజూరు చేస్తారని తెలిపాడు. దీంతో పట్టణంలో వివిధ కాలనీలకు చెందిన మొత్తం 14 మందిని గుంపు చేశాడు.

అంకెల గారడీ..
అందరికీ బ్యాంకులో విత్‌డ్రా ఫాంలలో ఒక్కొక్కరికీ రూ. 50వేలు నుంచి రూ. లక్ష  మంజూరు చేయిస్తున్నట్లు అంకెలు రాశాడు. రెండు రోజుల క్రితం అందరి ఇళ్ల వద్దకు పోయి ఈ నెల 31వ తేదీన అనంతపురానికి వెళితే డబ్బులు డ్రా చేసుకోవచ్చునని తెలిపాడు. అదేరోజు ఒక్కొక్కరు రూ. 5 వేలు తీసుకురావాలని చెప్పాడు.

నమ్మితే నట్టేట ముంచాడు..
లక్ష రూపాయల వరకూ రుణం వస్తుండడంతో మహిళలంతా ఎంతో ఆశతో బుధవారం అనంతపురం వచ్చారు. టవర్‌క్లాక్‌ వద్ద దిగి అతని సెల్‌ నంబర్‌కు 9542948475 ఫోన్‌ చేశారు. వెంటనే ద్విచక్రవాహనంలో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు.  సాయినగర్‌ స్టేట్‌ బ్యాంకు వద్దకు ఆటోలో రండి.. తాను అక్కడికి వస్తానని నమ్మబలికాడు. ఆటో ముందుకు వెళ్లిన వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బ్యాంకు వద్దకు వెళ్లిన బాధిత మహిళలు అతని కోసం కొన్ని గంటల పాటు ఎదురుచూశాడు. సెల్‌కు ఫోన్‌ చేస్తే పనిచేయలేదు.  

కేసు నమోదుకు ససేమిరా..
మోసపోయామని గ్రహించిన బాధిత మహిళలు వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. తమకు ఓ వ్యక్తి అన్యాయం చేశాడని మొరపెట్టుకున్నారు. పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటూ ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. చివరకు బాధితులు నిరాశతో వెనుదిరిగారు.

చలించిన హృదయం
నడిరోడ్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళల సమస్యను విన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు చంద్రశేఖర్‌రెడ్డి బాధిత మహిళలను ఉరవకొండ వరకూ ఉచితంగా తీసుకెళతానని ముందుకు వచ్చాడు. కనీసం ఆ మాత్రం కూడా పోలీసులు చేయకపోవడంపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలీసులు కనికరం చూపలేదు  
వెంకటరమణ అనే వ్యక్తి మోసం చేశాడని అన్ని పోలీస్‌స్టేషన్‌లకూ వెళ్లాం. అయితే ఎవరూ మా సమస్య వినేందుకు కూడా ఇష్టం చూపలేదు. కేసు నమోదు చేయలేదు. సీసీ కెమెరాల్లో చూస్తే నిందితున్ని పట్టుకోవచ్చు. పోలీసులు మాపై కనికరం చూపి నిందితున్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి.        – షరీఫా, బాధితురాలు, ఉరవకొండ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top