ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు

Cheating Case Filed Against Prashant Kishor - Sakshi

పాట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ(జేడీయూ) మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. తన ఐడియాను కాపీ చేసి ప్రశాంత్‌ కిషోర్‌‘ బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమాన్ని రూపొందించారంటూ బిహార్‌ మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి ‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచనల్లో రూపుదిద్దుకుందని, కానీ, తన మాజీ సహోద్యోగి అయిన ఒసామా అనే వ్యక్తి ఆ ఐడియాను ప్రశాంత్‌ కిషోర్‌కు చెప్పాడని గౌతమ్‌ ఆరోపించాడు. తాను ‘బిహార్‌ కీ బాత్‌ ’ అనే కార్యక్రమాన్ని జనవరి నెలలో ప్రారంభిస్తే.. ఆయన తన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలలో ప్రారంభించాడని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశాడు.( ప్రశాంత్‌ కిశోర్‌కి యమ క్రేజ్‌! )

దీంతో 402, 406 సెక్షన్ల కింద ప్రశాంత్‌ కిషోర్‌, ఒసామాలపై కేసులు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20న ప్రశాంత్‌ కిషోర్‌ ‘బాత్‌ బిహార్‌ కీ’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన అన్నారు. బిహార్‌ను దేశంలోని 10 గొప్ప రాష్ట్రాల్లో ఒకటిగా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.( గాంధీ వైపా? గాడ్సే వైపా? )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top