తెరవెనుక ఎర్ర స్మగ్లర్‌!

Character artist In Sandlewood Smuggling Tirupati Chittoor - Sakshi

మూడేళ్లలో రూ.కోట్లకు అధిపతి

సినిమాలకు ఫైనాన్స్‌ చేసే స్థాయికి ఎదిగిన వైనం

స్మగ్లర్ల జాబితాలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యార్థులు

సాక్షి, తిరుపతి : ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. ఎర్రచందనం అక్రమ రవాణాతో  నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హీరోగా నటించిన సినిమాకు పెట్టుబడి పెట్టాడు. సినిమా ఆర్టిస్ట్‌ రూపంలో ఉన్న ఆ ఎర్రచందనం స్మగ్లర్‌ కోసం తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు గాలిస్తున్నారు.

తిరుపతికి చెందిన సాదా సీదా వ్యక్తి ఒకరు టీవీ సీరియల్స్, జబర్దస్త్‌ కార్యక్రమంలో ఆర్టిస్ట్‌గా నటించేవాడు. నిదానంగా ఎర్రచందనంస్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. శేషాచలంలోని చెట్లను నరికి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించాడు. తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తాడు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. దాంతో అతనిపై సుమారు 20 కేసులు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు.

ఇటీవల విడుదలైన ఓ సినిమాకు ఫైనాన్స్‌ చేశాడని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేశారు. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇతనితో పాటు మరి కొందరు విద్యార్థులు, చిన్న చిన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడితో పాటు అనుచరుల కోసం గాలిస్తున్నట్లు టాస్క్‌పోర్స్‌ అధికారులు తెలిపారు. 2017 నవంబర్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ నిందితుల పేర్లు వెల్లడించడానికి వీలులేదని ఓ టాస్క్‌ఫోర్స్‌ అధికారి తెలిపారు. కేసులో మరో ఇద్దరు ఆర్టిస్టులు కూడా ఉన్నారని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top