నేడు మరోసారి సుజనా చౌదరి కంపెనీల్లో సీబీఐ సోదాలు

CBI Will Rides Again On Sujana Chowdary Companies Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నేడు మరోసారి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో సోదాలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నిన్న బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సూజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ సెల్‌ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి పొందిన నిధులను ఇతర మార్గాల్లో డొల్ల కంపెనీలకు తరలించినట్లు సుజనా చౌదరిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే.

ఏం జరిగిందంటే?
బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) కంపెనీ సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్‌ విజయ రామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి 2010 నుంచి 2013 మధ్యకాలంలో రూ. 364 కోట్లు రుణం తీసుకుంది. బీసీఈపీఎల్‌కు రుణం ఇచ్చేందుకు ఈ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈ మొత్తంలో ఆంధ్రా బ్యాంకు రూ. 71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు తీసుకున్నారు. ఈ రుణాలను గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు సీబీఐ ఆధారాలు, పత్రాలు సేకరించింది. ప్రస్తుత దాడులు ఆంధ్రా బ్యాంకుకు సంబంధించి రూ. 71 కోట్ల ఎగవేతకు సంబంధించినవి కావడం విశేషం.
చదవండి : సుజనా ఇంట్లో సీబీఐ సోదాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top