ఠారెత్తిస్తున్నాయ్‌! | Car Accidents With Drunk And Drives in Hyderabad | Sakshi
Sakshi News home page

ఠారెత్తిస్తున్నాయ్‌!

Jan 8 2019 10:48 AM | Updated on Jan 8 2019 10:48 AM

Car Accidents With Drunk And Drives in Hyderabad - Sakshi

ఆదివారం మన్సూరాబాద్‌లో చికెన్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు

మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు మన్సూరాబాద్‌ సాయినగర్‌ కాలనీలో మూసేసి ఉన్న చికెన్‌ సెంటర్‌లోకి దూసుకుపోయాడు. ఫలితంగా తోపుడు బండి, దుకాణం ధ్వంసం కావడంతో పాటు షాపులో నిద్రిస్తున్న సాయి, నగేష్‌లకు గాయాలయ్యాయి.  
మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై శంషాబాద్‌ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఒకరే ఉండటంతో ప్రాణనష్టం తప్పంది.  
గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలోని గౌలిదొడ్డి వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. మితి మీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

సాక్షి, సిటీబ్యూరో:  గడిచిన మూడు రోజుల్లో రాజధానిలో వెలుగులోకి వచ్చిన కారు ప్రమాదాలకు మచ్చుతునకలివి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఇలా మూడు కమిషనరేట్లలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఈ తేలికపాటి వాహనాలు ఠారెత్తించేస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకోవడం వెనుక అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏటా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తేలికపాటి వాహనాలుగా పిలిచేకార్ల వాటా పది శాతానికి పైగా ఉంటోంది.  

మద్యం నుంచి నిర్లక్ష్యం వరకు...
కార్ల వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో అత్యంత సంచలనాత్మక ఘటనలూ ఉంటున్నాయి. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటికి వద్ద జరిగిన చిన్నారి రమ్య ఉదంతం, నారాయణగూడ ఫ్లైఓవర్‌ పై పట్టపగలు ఓ నిండు ప్రాణాన్ని తీసిన వైనం... ఇలా ఎన్నో సంచలనాత్మక ఉదంతాలు గత ఏడాది చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా మద్యం మత్తులో డ్రైవింగ్‌ చెయ్యడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడం కూడా ఓ కారణంగా మారుతోందని అధికారులు చెప్తున్నారు. వీటికితోడు నగరంలోని రహదారుల్లో ఉన్న ఇంజినీరింగ్‌ లోపాలు, డ్రైవర్ల నిద్రమత్తు సైతం ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సిటీలో వంపులు లేకుండా ఉన్న రహదారుల్ని వేళ్ళ మీద లెక్కట్టొచ్చు. అందులోనూ అనేక బాటిల్‌నెక్స్‌ ఉంటాయి. ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. 

డ్రైవింగ్‌ అంటే ‘ఆ మూడే’ అని...
ఇటీవల కాలంలో నగరంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ పెరగడం, ఫైనాన్సింగ్‌ విధానాలు ఇలా అనేక కారణాల నేపథ్యంలో కార్లు ఖరీదు చేస్తున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. వీరంతా ప్రాథమికంగా వివిధ డ్రైవింగ్‌ స్కూళ్ళల్లోనో, పరిచయస్థుల వద్దో డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరి దృష్టంగా స్టీరింగ్, క్లచ్, బ్రేక్‌ల పైనే ఉంటోంది. ఈ మూడింటినీ నిర్వహించగలిగితే ఎక్కడైనా వాహనం నడుపవచ్చని భావిస్తుంటారు. అయితే హఠాత్పరిణామాలు, మార్జిన్స్, ఓవర్‌ టేకింగ్‌ తదితర సందర్భాల్లో తీసుసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరికి పూర్తి స్థాయిలో పట్టు ఉండట్లేదు. దీంతో ‘ఆ మూడు’ నేర్చుకుని రోడ్ల పైకి వస్తున్న వాహనచోదకులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు లోనుకావడంతో పాటు కారకులుగానూ మారుతున్నారు. 

లైసెన్స్‌ జారీ విధానాల్లోనూ లోపాలెన్నో...
నగరంలోనే కాదు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ వ్యవహారం లోపభూయిష్టంగా ఉంది. ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ చేయడానికి ముందు నిర్వహించే కంప్యూటర్‌ పరీక్ష తూతూ మంతంగా సాగిపోతోంది. దీని తర్వాత ట్రాక్‌ టెస్ట్‌ జరుగుతుంది. ఇప్పటికే ఏ కేంద్రంలోనూ సాకేంతిక పరిజ్ఞానంతో ట్రాక్‌ టెస్ట్‌ చేసే సామర్ధ్యం లేదు. కేవలం మాన్యువల్‌గా మాత్రమే, కేవలం కొన్ని అంశాలనే తనిఖీ చేస్తున్నారు. లైసెన్సులు జారీ చేసే విధానంలో లోపాల కారణంగా డ్రైవింగ్‌పై పూర్తి పట్టులేని వారికీ లైసెన్సులు వచ్చేస్తున్నాయి. వీరిలో కొందరు క్యాబ్‌ డ్రైవర్లు కూడా ఉంటున్నారు. ఇలాంటి డ్రైవర్ల కారణంగా తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్ని పూర్తిగా మార్చి, లోపాలను సరి చేయడంతో పాటు నిబంధనల్నీ కఠినతరం చేస్తేనే ప్రమాదాలను నిరోధించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement