బుల్లెట్‌ ఓర్‌ తవ్వకాల వెనుక ఓ మహిళ | Bullet Oar Mafia | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రాణి

Jun 19 2018 11:59 AM | Updated on Jun 19 2018 11:59 AM

Bullet Oar Mafia - Sakshi

బెంగళూరు కంపెనీ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న యువతి నివసిస్తున్న భవనం

విజయనగరంలో ఓ అధునాతన భవనం... అందులో ఓ యువతి... ఆమెకు రక్షణగా ఇద్దరు బాడీగార్డులు... ఇంట్లో పనికోసం నియమించుకున్న కొందరు పరివారం. ఆమె సాధారణ యువతి అనుకునేరు. ఏడాదిగా రూ. కోట్లలో లావాదేవీలు సాగించేస్తున్న ఓ ముఠా నాయకురాలు. ఆమెను సామాన్యులు కలవడం అంత సులభం కాదు.  వ్యాపార లావాదేవీలకోసం వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించి... వారివద్ద నున్న మొబైళ్లతో సహా... ఉన్న వస్తువులు తీసుకుని మాత్రమే లోనికి అనుమతిస్తారు.

ఇదంతా విలువైన ఖనిజాన్ని గుర్తించి దానిని తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక యంత్రాంగం. విజయనగరం కేంద్రంగా రెండు మూడు జిల్లాల్లో సాగిస్తున్న కార్యకలాపాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. మరో నమ్మశక్యం కాని విషయమేంటంటే... ఆ ముఠా నాయకురాలి నివాసం ఎస్పీ బంగ్లాకు కూతవేటు దూరంలోనే ఉండటం.

సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్‌: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజక వర్గం గరివిడి మండలం శేరిపేటలో అక్రమ మైనింగ్‌ వెనుక చాలా పెద్ద వ్యవస్థే ఉంది. బుల్లెట్‌ ఓర్‌ కోసం బెంగళూరు కంపెనీ పేరుతో ఇక్కడి రైతులను మభ్యపెట్టి తవ్వకాలు జరిపిస్తున్న ముఠాకు ఓ మహిళ నేతృత్వం వహిస్తోంది. విజయనగరం పట్టణంలో మకాం వేసి చుట్టు పక్కల జిల్లాల్లో బుల్లెట్‌ ఓర్‌ కోసం పరిశోధనలు జరుపుతున్నారు.

ఇప్పటికే ఏడు మైనింగ్‌ ప్రాంతాలను గుర్తించగా వాటిలో మూడు  విజయనగరం జిల్లాలో ఉన్నాయి. విశాఖపట్నంలోని  పెందుర్తి – సబ్బవరం జాతీయ రహదారికి సమీపంలో ఒక మైనింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. మిగతావి కూడా పూర్తి చేయడానికి ఉన్నతస్థాయిలో లాబీయింగ్‌ నడుపుతున్నారు. ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్‌ పరిశోధనలో ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

ఎస్పీ బంగ్లాకు కూతవేటు దూరంలోనే నివాసం

విజయనగరం పట్టణంలోని తోటపాలెం ప్రాంతంలో జిల్లా ఎస్పీ బంగ్లాకు కూత వేటు దూరంలో శ్రీనివాస కాలేజ్‌ వెనుక ఓ భవంతి ఉంది. పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకున్న ఓ మహిళ అందులో ఒంటరిగా నివసిస్తోంది. కొందరు బాడీగార్డ్స్‌ ఇద్దరు పనిమనుషులు ఆమె పరివారం. ఎవరైనా ఆమెను కలవాలని వస్తే గేటు వద్దనే బాడీగార్డ్స్‌ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మొబైల్స్‌తో పాటు అన్ని పరికరాలు లాక్కొని లోనికి పంపిస్తారు.

అది కూడా తెలిసిన వాళ్లకైతేనే ప్రవేశం. కొత్తవారెవరికీ లోనికి ప్రవేశం లేదు. ఇక బుల్లెట్‌ ఓర్‌ తవ్వకాల గురించి మాట్లాడేందుకు వచ్చే వారికి తన డాబు, దర్పం ప్రదర్శిస్తుంది. తనకు కర్ణాటక రాష్ట్ర మంత్రులతో పరిచయాలున్నట్లు, కొందరు పెద్దలు, ఉన్నతాధికారులతో సంబంధాలున్నట్లు మాట్లాడుతారు. అవన్నీ విని ఆమెకు చాలా పెద్ద నెట్‌వర్క్‌ ఉందని అక్కడివారు భావిస్తుంటారు. ఆమె చెప్పినట్లు వింటే డబ్బులు బాగా సంపాదించవచ్చని నమ్ముతుంటారు.

రెండు జిల్లాల్లో ఏడు మైనింగ్‌ ప్రాంతాలు

బుల్లెట్‌ ఓర్‌ గురించి ఏ మాత్రం బయటకు పొక్కనివ్వకుండా తెర వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది క్రితం విజయనగరంలో దిగిన బెంగళూరు మహిళ విజయనగరం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ తవ్వకాలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విశాఖలో పెందుర్తి, సబ్బవరం జాతీయ రహదారికి వంద అడుగుల దూరంలోనే ఒక మైనింగ్‌లో తవ్వకాలు జరిపి ఓర్‌ను తరలించారు. మరో మూడు ప్రాంతాలను గుర్తించారు. జిల్లాలోనూ మూడు ప్రాంతాల్లో మైనింగ్‌ జరపాలనుకున్నారు. గరివిడి మండలం శేరిపేట, గుర్ల మండలం గుజ్జింగివలస, గంట్యాడ మండలం లకిడాం ప్రాంతాల్లో గనులు గుర్తించారు. 

పలాయనం చిత్తగించిన పరివారం

శేరీపేటలో తవ్వకాలు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ‘సాక్షి’ వారి ప్రయత్నాన్ని బట్టబయలు చేసింది. దీంతో బుల్లెట్‌ రాణి పలాయనం చిత్తగించింది. తన బాడీగార్డులతో పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇంటిలో లకిడాం ప్రాంతానికి చెందిన ఒక మహిళ, ఒక యువతి ఉన్నారు.

‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్‌ బృందం వారిని కలిసి ఆరాతీయగా... తమకేమీ తెలియదని, ఒక మేడమ్‌ తమను ఇంటి పనులకు నెల రోజుల క్రితం నియమించుకుని రూ. 3వేల జీతం ఇస్తామన్నారని వివరించారు. ప్రస్తుతం తమ మేడమ్‌ క్యాంపునకు వెళ్లారని వెల్లడించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు వంద మంది రైతులు, అనుచరులతో సంప్రదింపులు జరిపిన బుల్లెట్‌ రాణి స్థానికుల సాయంతోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement