చిరుత దాడిలో సాధువు మృతి

Buddhist Monk Killed By Leopard In Maharashtra Ramdegi Forest - Sakshi

సాక్షి, ముంబై : ధ్యానముద్రలో ఉన్న బౌద్ధ సాధువుపై చిరుత దాడి చేయడంతో అతడు మృతిచెందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు... రాహుల్‌ వాకే బోధి(35) అనే సాధువు గురువారం తన ఇద్దరు అనుచరులతో కలిసి రామ్‌దేగి అడవుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా అటుగా వచ్చిన చిరుత పులి రాహుల్‌పై దాడి చేసింది. దీంతో అతడి అనుచరులిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. వారు తిరిగి వచ్చి చూసే సమయానికి రాహుల్‌  కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు.

ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రాహుల్‌ జాడ కోసం వెతుకున్న క్రమంలో అతడి శవం దొరికింది. దాడి చేసిన తర్వాత చాలా దూరంపాటు అతడి శవాన్ని ఈడ్చుకుపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. గత నెలరోజుల్లో రామ్‌దేగి పరిసర ప్రాంతాల్లో చిరుత దాడిలో ఐదుగురు మృతిచెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడవిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసినప్పటికీ రాహుల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు పోగొట్టుకున్నాడని.... ఇకనైనా ఎవరూ అటువైపుగా వెళ్లవద్దని సూచించారు.

కాగా మనుషులను వేటాడి చంపుతుందనే కారణంగా ఇటీవలే అవని అనే ఆడపులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో యవత్మాల్‌ పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అవనిని హతం చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై జంతుప్రేమికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top