బావిలోపడి అన్నదమ్ముల దుర్మరణం

brothers died accidentally - Sakshi

మరణంలోనూ వీడని బంధం

కాలుజారి బావిలో పడిన అన్న

అన్నను కాపాడబోయి నీటిలో మునిగి తమ్ముడు కూడా మృతి 

చిలుకూరు మండలంలో కొండాపురంలో విషాదఛాయలు

చిలుకూరు (కోదాడ) : ఆ అన్నదమ్ములిద్దరు బీఈడీ వరకు చదువుకున్నారు. గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. మండలంలోని కొండాపురంలో గురువారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పల్లా రంగయ్యకు ఇద్దరు కుమారులు పల్లా గోపాలరావు(32), పల్లా నరేష్‌(28). ఇద్దరు గురువారం ఉదయం గ్రామశివారులో బేతవోలు చెరువు పక్కన గల తమ వ్యవసాయ పొలంలో పురుగు మందు పిచికారి చేయడం కోసం తమతో పాటు మందు కొట్టేందుకు గ్రామానికి చెందిన పిల్లుట్ల బాలకృష్ణను వెంట తీసుకెళ్లారు.

ట్యాంక్‌తో బాలకృష్ణ మదు కొడుతుండగా గోపాలకృష్ణ బావిలో నుంచి నీళ్లు అందిస్తున్నాడు. తమ్ముడు నరేష్‌ నీటిని తీసుకెళ్లి ట్యాంక్‌లో పోస్తున్నాడు. ఈ క్రమంలో గోపాలరావు ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. గోపాలరావుకు ఈత రాకపోవడంతో.. మునిగి పోతున్నాడు. గమనించిన తమ్ముడు నరేష్‌ అన్నను కాపాడబోయి.. తనకూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ట్యాంకులో నీళ్లు పోసేందుకు ఇద్దరూ రాకపోవడంతో బాలకృష్ణ బావి వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు బావిలో పడి మృతి చెందారు.

విషయాన్ని వెంటనే బాలకృష్ణ మృతుల తండ్రి రంగయ్యకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ మృతిచెందడంతో.. గ్రామస్తుల సాయంతో బావిలోని మృతదేహాలను బయటకు తీశారు. గోపాలరావుకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నరేష్‌కు భార్య ఒక కుమారుడు ఉన్నారు. నరేష్‌ రైతు సమన్వయ సమితి కొండాపురం గ్రామ కోఆర్డి నేటర్‌గా ఇటీవల నియామకమయ్యాడు. 

చెరువు వెంట బావి ఉండడం వల్లే..
వీరి వ్యవసాయ బావి చెరువు వెంట ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. పలువురు పేర్కొంటున్నారు. బావి చాలా పెద్దగా ఉండడం.. చెరువు బావి కలిసినట్లు ఉండడం వల్ల అన్నను కాపాడే ప్రయత్నంలో నరేష్‌ కూడా మృతి చెందాడని అంటున్నారు. 

గ్రామంలో విషాదఛాయలు
ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తండ్రి రంగయ్య, తల్లి ఆర్తనాదాలు పలువురుని కంటతడి పెట్టించాయి. రంగయ్య సర్పంచ్‌గా అందరి పరిచయస్తుడు కావడంతో ప్రజలు పెద్దఎత్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోపాలరావు, నరేష్‌ భార్యాపిల్లలను చూసి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్‌ సీఐ రవి పరిశీలించారు. తండ్రి రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నర్సయ్య తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top