మరదలిని హత్య చేసిన బావ

Brother in law Killed Sister In law in East Godavari - Sakshi

పటవల శాంతిమూలలో ఘటన

తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): రోడ్డుకు అడ్డంగా సామాన్లు కడుగుతోందన్న కోపంలో మరదలిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ శాంతిమూల గ్రామంలో జరిగింది. కోరంగి ఎస్సై సుమంత్‌ కథనం ప్రకారం.. పటవల శాంతిమూల ఎస్సీపేటలో పోలినాటి నాగమణి అతడి ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తోంది. పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్‌లు ఒక ఇంట్లో నివసిస్తుండగా, మూడో కుమారుడు సత్యనారాయణ, మాధవి దంపతులు పక్కనే ఉన్న పూరిపాకలో నివసిస్తున్నారు. మాధవి(25) బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై సామాన్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్‌ పూటుగా మద్యం సేవించి అటుగా వెళుతుండగా, రోడ్డుపై సామాన్లు అడ్డంగా ఉండడంతో ఇలా ఉంటే ఎలా వెళ్లాలి? అని ఘర్షణకు దిగాడు. దీంతో పక్కనే ఖాళీ ఉంది కదా? అని మాధవి చెప్పడంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్‌ మూడడుగుల లావుపాటి బద్ది కర్రతో మాధవి తలపై కుడిభాగంలో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మాధవి అక్కడికక్కడే మృతి చెందింది.

ఇంట్లో భోజనం చేస్తున్న సత్యనారాయణ బయటకు వచ్చేసరికే మాధవి మృతి చెందినట్టు చెబుతున్నారు. మృతురాలికి నాలుగేళ్ల అనువాసిని అనే కుమార్తె, 15 నెలల రాజు కుమారుడు ఉన్నారు. తల్లి మృతితో పిల్లలు బిక్కుబిక్కు మంటూ చూడడం స్థానికులను కలచివేస్తోంది. ఇలా ఉండగా శ్రీనివాస్‌ మద్యానికి బానిస కావడంతో 15 ఏళ్ల క్రితమే అతడి భార్య ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్రీనివాస్‌ తల్లితోనే కలిసి ఉంటున్నాడు. కూలి పని చేసుకునే శ్రీనివాస్‌ ఒక్కొక్కసారి మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుంటాడని చెపుతున్నారు. గతంలో రెండుసార్లు శ్రీనివాస్‌ బ్లేడుతో పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  పెద్దకుమారుడు భార్య కువైట్‌లో ఉండడం, రెండో కుమారుడు భార్య వదిలి వెళ్లిపోవడం, మూడో కుమారుడు భార్య మృత్యువాత పడడంతో వారికిగల చిన్నారుల బాధ్యత నానమ్మ నాగమణిపై పడింది. వీళ్లందరినీ ఎలా సాకాలి? అంటూ నాగమణి బోరున విలపిస్తుంది. కాకినాడ రూరల్‌ సీఐ రాంబాబు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top