ఈసారి ‘డేగ’ వంతు

Bribe Taken By The VRO Degala Rajendram From Farmer - Sakshi

సాక్షి, ముదిగొండ: ఏసీబీ వలలో ఎప్పుడూ అవినీతి చేపలే పడతాయి. ఈసారి మాత్రం ‘డేగ’ చిక్కుకుంది. పట్టాదారు పాత పాస్‌ పుస్తకంలో నమోదైన నాలుగు ఎకరాల 12 కుంటల భూమిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు ఓ రైతు నుంచి పదివేల రూపాయలను లంచంగా ఇవ్వాలని వీఆర్‌ఓ డేగల రాజేంద్రం డిమాండ్‌ చేశాడు. ఈ అవినీతి ‘డేగ’ పైకి ఏసీబీ అధికారులు వల విసిరారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టేశారు. 

మండలంలోని గంధసిరి గ్రామ రైతు చెమట నాగేశ్వరరావు పేరిటగల పట్టాదారు పాత పాస్‌ పుస్తకంలో నాలుగు ఎకరాల 12 కుంటల భూమి వివరాలు నమోదయ్యాయి. వీటిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు నాగేశ్వరరావు కుమారుడు వేణు, నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి వీఆర్‌ఓ డేగల రాజేంద్రం వద్దకు, తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పదివేల రూపాయలు ఇస్తేనే, కొత్త పాస్‌ పుస్తకంలోకి భూమి వివరాలు ఎక్కిస్తానని డేగల రాజేంద్రం స్పష్టంగా చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వేణు చెప్పారు.

కొద్ది రోజుల తరువాత, ఎనిమిదివేల రూపాయలకు వీఆర్‌ఓ దిగొచ్చాడు. ఈ మొత్తాన్ని ఆయనకు వేణు సమర్పించుకున్నాడు. కొత్త పాస్‌ పుస్తకం చేతికొచ్చింది. తీరా చూస్తే... అందులో, కేవలం రెండు ఎకరాల 23 కుంటల భూమి మాత్రమే ఎక్కింది. మిగతా, ఒక ఎకరం 28 కుంటలన్నర ఎక్కించలేదు. దీని కోసం, వేణు మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు వెళ్లినా వీఆర్‌ఓ డేగల రాజేంద్రం పట్టించుకోవడం లేదు. మరో ఐదువేల రూపాయలు ఇస్తే... పని పూర్తవుతుందని వేణుకు గురువారం డేగల రాజేంద్రం ఫోన్‌ చేశాడు. వెంటనే ఖమ్మం చేరుకున్న వేణుకు, ఏం చేయాలో పాలుపోలేదు. తన గోడును వినిపించేందుకు ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లాడు. 

అవినీతి ‘డేగ’ను ఇలా పట్టేశారు... 
లంచం కోసం వేణును, అతడి తండ్రిని పీక్కు తింటున్న ఆ ‘డేగ’ను వల వేసి పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పథకం వేశారు. ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్‌ వద్ద వేణు నుంచి ఐదువేల రూపాయలు తీసుకుంటున్న డేగల రాజేంద్రాన్ని వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ ఎస్‌.ప్రతాప్, సీఐలు ఎస్వీ రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వెంకట్‌... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడి నుంచి రైతు కుమారుడు వేణును, వీఆర్‌ఓ డేగల రాజేంద్రాన్ని ముదిగొండ తహసీల్దార్‌ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

డీటీ కరుణాకర్‌రెడ్డి, వీఆర్‌ఓ నాగలక్ష్మి నుంచి వివరాలు తెలుసుకున్నారు. రైతు వద్దనున్న పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను పరిశీలించారు. అతని నుంచి వివరా లు సేకరించి రికార్డ్‌ చేశారు. వీఆర్‌ఓ డేగల రాజేంద్రాన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు విలేకరులకు డీఎస్పీ ప్రతాప్‌ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, రైతుల పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల విషయంలో ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏసీబీ అధికారులకు 94407 00049 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top