ప్రాణానికి ప్రాణం అడ్డేసి

Boy Died In Pond Chittoor - Sakshi

నీటిలో పడ్డ చిన్నారిని కాపాడిన యువకుడు

బురదలో కూరుకుపోయి మృత్యువాత పడ్డ వైనం

చిత్తూరు ఇరువారంలో విషాదం

నీటి కుంటలో పడిన కుమార్తెనుచూసి తల్లి తల్లడిల్లింది. తనకు ఈత రాదన్న విషయాన్ని మరిచిపోయినీటిలో దూకేసింది. గమనించిన యువకుడు చిన్నారిని కాపాడాడు. తాను బురదలో కూరుకుపోయి తనువు చాలించా డు. చిత్తూరు నగరంలోని ఇరువారంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికుల్ని కలచివేసింది.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఇరువారం వికలాంగుల కాలనీ (పీహెచ్‌)కి చెందిన కార్తీక్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు ఢిల్లీ ప్రసన్న (18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివా రం ధనలక్ష్మి, ఆమె కుమారుడు ఢిల్లీ ప్రసన్న, అదే కాలనీకి చెందిన కన్నెకేశ్వరి, ఆమె కుమార్తె మమత, మనవరాలు పవిత్ర(9)తో కలిసిఇరువారం చెక్‌డ్యామ్‌ పక్కనున్న అడవుల్లోకి కట్టెలు కొట్టడానికి వెళ్లారు. మమత కట్టెలు కొట్టి వాటిని ఇంటి వద్ద వేసిరావడానికి వెళ్లింది. ఇంతలో పవిత్ర కాలుజారి నీటి కుంటలో పడిపోయింది. దీన్ని గమనించిన ధనలక్ష్మి తనకు ఈత రాదనే విషయాన్ని మరచిపోయి పవిత్రను కాపాడేందుకు నీటిలోకి దూకి బురదలో కూరుకుపోయింది. వారిని కాపాడడానికి పవిత్ర అమ్మమ్మ కన్నెకేశ్వరి నీటిలోకి దూకింది.

అందరూ కేకలు వేస్తుండడంతో పక్కనే ఉన్న ఢిల్లీ ప్రసన్న నీటిలోకి దూకి పవిత్రను గట్టుపైకి విసిరేసి తాను బురదలో కూరుకుపోయాడు. గట్టుపై ఉన్న కాలనీకి చెందిన రమీజా అనే మహిళ తన చీర సాయంతో ధనలక్ష్మి, కన్నెకేశ్వరిని కాపాడింది. బురదలో కూరుకుపోయిన ఢిల్లీ ప్రసన్నను రోడ్డుపై అటుగా వెళుతున్న వారు బయటకులాగి ఆటోలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. దీంతో పీహెచ్‌ కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.  నువ్వు వెళ్లిపోయావా నాయనా.. ఉన్న ఒక్కగానొక్క కొడుకును బలితీసుకున్నావు.. నీకు న్యాయమేనా భగవంతుడా..’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ఆమెను చూసి చుట్టుపక్కల వారూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. టూటౌన్‌ సీఐ వెంకటకుమార్‌ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top