మాల్యా కేసులో భారత ప్రభుత్వం గ్రేట్‌ విక్టరీ

Big Victory For Indian Govt, Vijay Mallya Ready To Settle His Dues - Sakshi

లండన్‌ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా కేసులో భారత ప్రభుత్వం ఘన విజయం సాధించింది. భారత ప్రభుత్వ ధాటికి తట్టుకోలేక ఎట్టకేలకు దిగొచ్చిన విజయ్‌ మాల్యా బ్యాంకులకు బకాయి పడిన రుణాలన్నింటిన్నీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్న రుణాలను సెటిల్‌ చేయడానికి తాను ప్రయత్నాలన్నింటిన్నీ కొనసాగిస్తున్నానని చెప్పారు. తీసుకున్న రుణాలన్నింటినీ సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం తనపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందని, ఇలాంటి వ్యవహారాలతో తాను అలసిపోయినట్టు పేర్కొన్నారు. రుణాలను రికవరీ చేయడం సివిల్‌ విషయమని, కానీ తనది మాత్రం క్రిమినల్‌ కేసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇదే విషయంపై మాల్యా, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రికి రాసినట్టు చెబుతున్న లేఖ ప్రస్తుతం బహిర్గతమైంది. బ్యాంకుల రుణాలను సెటిల్‌ చేసుకోవడానికి మాల్యా అంగీకరించినట్టు ఆలేఖలో ఉంది. అయితే కన్సార్టియం ఆఫ్‌ బ్యాంకుల విషయంలో మాల్యా అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిల్లో నకిలీ బ్యాంకులు ఉన్నట్టు మాల్యా ఆరోపించారు. రుణాలను చెల్లించడంలో భాగంగా న్యాయ పర్యవేక్షణలో ఉన్న తన ఆస్తులను విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని మాల్యా కోరారు. విక్రయించిన ఆస్తుల ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని ప్రకటించారు.  బ్యాంకులకు దాదాపు రూ.13 వేల కోట్ల మేర రుణాలను మాల్యా బకాయి పడిన సంగతి తెలిసిందే. మాల్యాను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అయితే తన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మాల్యా ఆరోపించారు. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టిన మాల్యా, ప్రస్తుతం లండన్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.  అతన్ని భారత్‌కు అప్పగించే వ్యవహారంపై లండన్‌ కోర్టులో ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top