అబద్దపు కాల్స్‌తో అమాయకులకు బురిడీ

Bank Holders Money Transfer To Unknown accounts  In West Godavari - Sakshi

సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి):  ‘హలో నేను బ్యాంకు అధికారిని.. ముంబై నుంచి మాట్లాడుతున్నాను.. మీ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ చెప్పండి... వివరాలు సరిపోల్చుకోవాలి...’ అంటూ ఫోన్‌ రాగానే బ్యాంకు నుంచే కదా అని తణుకు పట్టణానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి ఠక్కున అక్కౌంట్‌ నంబర్‌ చెప్పారు. ఇంకేముందు క్షణాల వ్యవధిలో తన సెల్‌ఫోన్‌ నంబర్‌ రెండు దఫాలుగా రూ.20 వేలు చొప్పున నగదు మాయమైనట్టు మెసేజ్‌ వచ్చింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

‘ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళ అక్కడే ఉన్న వ్యక్తిని నగదు డ్రా చేయమని అడిగింది. ఆమె ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎంలో చెక్‌ చేసి డబ్బులు లేవని చెప్పి ఆమెకు 
‘మోటారు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి రద్దీగా ఉండే ప్రాంతానికి వచ్చి బండిపై నుంచి అదుపుతప్పి పడిపోతున్నట్లుగా నటిస్తాడు. ఇదే సమయంలో సమీపంలోని ఎవరైనా ఇతనికి సాయం చేయడానికి వస్తారు. ఇదే అదనుగా చూసుకుని అప్పటికే అక్కడ కాపుగాసిన వ్యక్తి సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి జేబులోని పర్సు లేదా సెల్‌ఫోన్‌ అపహరిస్తాడు. ఈ తంతంగం అంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి ఇక్కడ దొంగతనాలు జరుగుతాయి..

నేరాలు ఇలా జరుగుతున్నాయ్‌
మొదట ఖాతాదారుడికి ఫోన్‌ కాల్‌ వస్తుంది.. సమాధానం ఇవ్వబోతే ముంబై నుంచో చెన్నై నుంచో బ్యాంకు ఉన్నతాధికారిని మాట్లాడుతున్నానని... మీ అకౌంట్‌ నంబర్‌ ఇవ్వాలని... మా వద్ద దురదృష్టవశాత్తూ నంబర్‌ పాడైందని చెబుతున్నారు. ఇది నిజమని నమ్మిన ఖాతాదారుడు వెంటనే ఆ నంబర్‌ చెబుతున్నారు. కాసేపటికే సెల్‌ఫోన్‌కు బ్యాంకు నుంచి వచ్చినట్లు మెసేజ్‌ వస్తుంది. అందులో ఏటీఎం నాలుగు అంకెల పిన్‌ నంబరు ఇవ్వమని కోరుతున్నారు. బ్యాంకు అధికారే కదాని ఇస్తున్నారు. పది నిమిషాల్లో డబ్బు డ్రా చేసినట్లు తిరిగి మెసేజ్‌ వస్తోంది. దీంతో నెత్తీనోరు బాదుకోవడం ఖాతాదారుడి వంతు అవుతోంది. ఆధార్‌ నంబరును బ్యాంకు అనుసంధానం చేయాలంటూ ఏటీఎం పిన్‌ నంబరు తెలుసుకుని తణుకు పట్టణానికి చెందిన రెడీమేడ్‌ దస్తుల వ్యాపారి మోటారాంచౌదరి బ్యాంకు ఖాతా నంబర్‌ తెలుసుకుని ఇదే తరహాలో రూ.16 వేలు కాజేసిన సంఘటన గతంలో చోటుచేసుకుంది.

కొవ్వూరుకు చెందిన దోర్భల ప్రభాకరశర్మకు ఇదే తరహాలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఆధార్‌ అనుసంధానం అంటూ ఏటీఎం పిన్‌ నెంబరు తెలుసుకుని సుమారు రూ.15 వేలు నగదు కాజేశారు. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన వ్యక్తి గోవాకు వెళ్లేందుకు ముందుగా హోటల్‌ గదిని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. ఇందుకు రూ.40 వేలు ఆన్‌లైన్‌ ద్వారా యాజమాన్యానికి చెల్లించారు. అయితే కొద్దిసేపటికే మరో హోటల్‌లో గది బుక్‌ అయినట్లు మెసేజ్‌ రావడంతోపాటు మరో రూ.40 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి.

అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ చోరీలు ఎక్కువగా జరగడానికి ఖాతాదారుల అమాయకత్వం, అవగాహన లేకపోవడమే కారణం. ఏ బ్యాంకు అధికారులైనా మనం ఫిర్యాదు చేయకుండా మనకు సంబంధించిన లావాదేవీల గురించి మనతో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ఖాతాకు సంబంధించిన నంబర్, పేరు, చిరునామా తదితర వివరాలన్నీ ఆయా బ్యాంకువారి వద్దే ఉంటాయి. ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్‌ చేస్తే బ్యాంకు ఖాతా నంబర్లు చెప్పడం మంచిది కాదు. మన ఖాతా నంబర్‌ ఎవరికైనా ఇచ్చే ముందు స్థానిక బ్యాంకు వారిని కూడా సంప్రదించడం మంచిది. 
–డీఎస్‌ చైతన్యకృష్ణ, సీఐ, తణుకు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top