
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంకు ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్ వద్ద దుండగులు కత్తులు, తల్వార్లతో వీరంగం సృష్టించారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి జొరబడిన దుండగులు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఇక్రమ్ ఖలీమ్‌పై కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. దీంతో ఇక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భూవివాదాలే ఈ దాడికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్‌లో ఈ సంఘటన జరిగింది.