ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో కలిసి ఆస్తి కాజేశారు!

Assets Fake Registration With Facebook Friend In Guntur - Sakshi

నకిలీ పత్రాలతో ఆస్తి  విక్రయించిన కేసులో 8 మందిపై కేసు

నలుగురి అరెస్ట్‌.. పరారీలో మరో నలుగురు వ్యక్తులు

నాటి గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌పై కూడా కేసు నమోదు

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : సత్యనారాయణపురం సీతన్నపేటలోని 176 గజాల ఆస్తికి చెందిన హక్కుదారు ఫొటోలు మార్చి నకిలీ పత్రాలతో ఆ ఆస్తిని విక్రయించిన కేసులో 8 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తిదారు మహిళ స్థానంలో చెన్నైకి చెందిన ఓ యువతి, నాటి గన్నవరం రిజిస్ట్రార్‌తో పాటు మరో ఆరుగురు ఈ కేసులో సూత్రధారులుగా పోలీసులు తేల్చారు.

అద్దెదారుడి సలహా..కథ నడిపిందంతా పరిచయస్తుడే..
రామవరప్పాడుకు చెందిన చింతమనేని జగదీష్‌కు సత్యనారాయణపురం సీతన్నపేటలో 176 గజాల స్థలం ఉంది. దాన్ని ఆయన 2002లో సుబ్బరాజు (56) కు 2009 వరకూ అగ్రిమెంట్‌ చేసుకొని అద్దెకు ఇచ్చారు. అయితే కొంతకాలానికే జగదీష్‌ మృతి చెందగా ఆమె కుమార్తె చింతమనేని సాహితికి వీలునామా ద్వారా ఆ ఆస్తి సంక్రమించింది. ఒప్పందం ముగిశాక సాహితీ అద్దెల కోసం సుబ్బరాజు వద్దకు పలుమార్లు వెళ్తుండగా ఆయన సమాధానం చెప్పకుండా తిరుగుతూ కాలయాపన చేశాడు. జగదీష్‌ చనిపోయిన తర్వాత ఆ ఆస్తిపై సుబ్బరాజుకు కన్ను పడింది. ఎలా కాజేయాలా అని ఆలోచనలు చేస్తుండగా మురళీనగర్‌కు చెందిన కళ్లేపల్లి సీతారామరాజు (32) పరిచయమయ్యాడు. అతను తన బంధువు, స్నేహితులతో కలిసి మిగిలిన కథ మొత్తం నడిపించాడ.

ఫేస్‌బుక్‌ స్నేహితురాలిని చూపి రిజిస్ట్రేషన్‌..
పక్కా ప్రణాళికను రూపొందించిన సీతారామరాజు తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన చెన్నైకు చెందిన అనుశ్రీ అనే యువతిని సాహితిగా చూపించేందుకు ప్లాన్‌ వేశాడు. ఆమెతో చింతమనేని సాహితిగా ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేయించాడు. తర్వాత గన్నవరం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బందిని పట్టుకొని అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ డి.సాయిమోహన్‌రెడ్డితో బేరం కుదుర్చుకున్నాడు. ఆధార్‌ కార్డు దరఖాస్తు ఎన్‌రోల్‌మెంట్‌ కాపీ పెట్టి 176 గజాల ఆస్తిని యనమలకుదురుకు చెందిన తన బావమరిది కళ్లేపల్లి వంశీరాజు (30) కు విక్రయించినట్లుగా రిజిస్టర్‌ చేయించాడు. ఆ తర్వాత వంశీరాజు నుంచి సీతారామరాజు కొనుగోలు చేసినట్లు తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

ఆ డాక్యుమెంట్లను రూ.35 లక్షలకు ఓ మహిళ దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు. కొన్ని రోజులకు ముత్యాలంపాడుకు చెందిన కవులూరి లక్ష్మీనారాయణ (50) వద్ద డబ్బులు తీసుకొని మహిళ రుణం తీర్చి కాగితాలు తీసుకున్నాడు. అదే రోజు విజయవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లక్ష్మీనారాయణకు ఆస్తిని విక్రయించాడు. తర్వాత లక్ష్మీనారాయణ ఆ డాక్యుమెంట్స్‌తో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థలో రూ.1.30 కోట్లు రుణం తీసుకున్నాడు. లోన్‌ సరిగా చెల్లించకపోవడంతో ఆ ఫైనాన్స్‌ కంపెనీ వాళ్లు ఇంటికి నోటీసులు అంటించడంతో అసలు ఆస్తిదారైన చింతమనేని సాహితి దృష్టికి ఈ తతంగం అంతా వెళ్లింది. దీనిపై ఈసీ ద్వారా ఆరా తీసిన ఆమె జరిగిన మోసం గురించి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీతారామరాజు, సుబ్బరాజు, వంశీరాజు, లక్ష్మీనారాయణలతో పాటు ఫేస్‌బుక్‌ స్నేహితురాలైన అనుశ్రీ, నాటి గన్నవరం సబ్‌ రిజిస్ట్రార్‌ డి.సాయిమోహన్‌రెడ్డి, విట్‌నెస్‌ సంతకాలు పెట్టిన పన్నీర్‌కుమార్, కళ్లేపల్లి పవన్‌కుమార్‌వర్మలపై కేసు నమోదు చేశారు.

నిందితుల అరెస్టుపై గోప్యత
నిందితుల వివరాలు వెల్లడించడంపై పోలీసులు గోప్యంగా వ్యవరించారు. కేసు నమోదు చేసినప్పుడు అదుపులోకి తీసుకున్న ఏ1 సీతారామరాజు, ఏ2 సుబ్బరాజు, వంశీరాజు, లక్ష్మీనారాయణలనే అరెస్టు చూపించి మీడియాకు తెలియకుండా మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం గా>లిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top