రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

ASI Died in Bike Accident Visakhapatnam - Sakshi

భార్యకు తీవ్ర గాయాలు

బోయపాలెం జాతీయ రహదారిపై ఘటన

విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి): మండలంలోని బోయపాలెం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి చెందగా అతని భార్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానిక పొలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న శిద్దాబత్తుల సత్యశ్రీ నగేష్‌ (55) అనారోగ్యానికి గురికాగా కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించుకునే నిమిత్తం సోమవారం ఉదయం తన భార్య విజయతో కలిసి మోటార్‌ బైక్‌పై విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి విజయనగరం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో వారు బోయిపాలెం జాతీయ రహదారిపైకి చేరుకునే సరికి ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా ఆగడంతో నగేష్‌ తన ద్విచక్ర వాహనానికి బ్రేక్‌లు వేశాడు. దీంతో అదుపుతప్పి భార్య భర్తలు రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనలో నగేష్‌ తలకు, చేతులకు తీవ్ర గాయాలుకాగా, విజయకు బలమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గమనించి రోడ్డుపై పడి ఉన్న ఇద్దరినీ పైకి లేవదీశారు. వెంటనే విజయ ఫోన్‌లో తమ బంధువులకు సమాచారం అందించింది. పోలీసులు వారిరువురిని 108 వాహనంలో నగరంలోని గీతం ఆస్పత్రికి తరలించగా అక్కడ నగేష్‌ మృతి చెందారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన విజయ గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆనందపురం సీఐ జి.శంకర రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కానిస్టేబుల్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించి..
విజయనగరంలోని పూల్‌బాగ్‌ కాలనీకి చెందిన శిద్ధాబత్తుల సత్యశ్రీ నగేష్‌ 1987లో కానిస్టేబుల్‌గా ఎంపికై విజయనగరం జిల్లాలోని పెదమానాపురంలో తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. తర్వాత అన్నవరం, బుదులువలస పోలీస్‌ స్టేషన్‌లోను, ట్రాఫిక్‌ విభాగంలోను పనిచేసిన ఆయన క్రైం విభాగంలో హెచ్‌సీగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు హరి కిరణి, వంశీకృష్ణ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరి కిరణికి వివాహం కాగా వంశీకృష్ణ ఇటీవలే పాలిటెక్నిక్‌ పూర్తి చేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top