అరుణదేవి ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం

Aruna Devi Suicide Case Investigation Speedup East Godavari - Sakshi

విదేశంలోని భర్తతో వీడియో కాల్, వాయిస్‌ రికార్డ్‌ ఆధారంగా దర్యాప్తు

సెల్‌ ఫోన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

తూర్పుగోదావరి,అమలాపురం టౌన్‌: అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులను తాళలేక ఆత్మహత్య చేసుకున్న అమలాపురం విద్యుత్‌నగర్‌కు చెందిన కామిశెట్టి అరుణదేవి కేసును పట్టణ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన మూడు నెలలకే ఫ్రాన్స్‌ దేశంలో ఉన్న భర్త, అత్త మాములు, ఆడపడుచు ఫోన్లతో పెడుతున్న వేధింపులకు విసిగి వేసారిన అరుణదేవి ఆత్యహత్య చేసుకుందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఫ్రాన్స్‌ లో ఉంటున్న అరుణదేవి భర్త పెరుమాళ్లు, అత్త మామలు, ఆడపడుచు మొత్తం నలుగురిపై డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ కేసులు నమోదు చేశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు శుక్రవారం విద్యుత్‌నగర్‌లో అరుణదేవి ఆత్యహత్య చేసుకున్న గదిని మరోసారి పరిశీలించారు. అలాగే అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలోని మార్చురీలో ఉన్న అరుణదేవి మృతదేహాన్ని కూడా పరిశీలించి మరిన్ని వివరాలు సేకరించారు.

మృతురాలి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. పెళ్లి చేసుకుని తనతో పాటు  తీసుకు వెళ్లకుండా కుంటి సాకులు చెబుతూ అదనపు కట్నం కోసం తమ అల్లుడు పెరుమాళ్లు నిత్యం విదేశం నుంచే ఫోన్లలో తన కుమార్తెను వేధించేవాడని అరుణదేవి తండ్రి వెంకటేశ్వరరావు డీఎస్పీకి వివరించారు. ఆత్మహత్యకు ముందు అరుణదేవి రికార్డు చేసిన వాయిస్‌ రికార్డు, వీడియో కాల్‌ చేసిన స్మార్ట్‌ ఫోన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఆ భార్యాభర్తల ఫోన్ల కాల్‌ డేటాలను సేకరించి కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. విదేశం నుంచి అరుణదేవి భర్త, అత్తమామలు వస్తేనే గాని ఆమెకు అంత్యక్రియలు నిర్వహించబోమని ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని కిమ్స్‌ ఆస్పత్రి మార్చురీలో ఉంచేశారు.

వీడియో కాల్‌ లైవ్‌లోనే ఆత్యహత్య: విదేశం  నుంచి భర్త రోజూ అదనపు కట్నం కోసం ఫోన్‌లో ఎంతెలా వేధించినా తల్లిదండ్రులకు అరుణదేవి పూర్తి విషయాలు చెప్పేది కాదు. భర్త నుంచి ఫోన్‌ వస్తే గదిలోకి వెళ్లి తలుపులు వేసి మాట్లాడేది.  బుధవారం రాత్రి తన స్మార్ట్‌ ఫోన్‌ నుంచి అరుణదేవి .‘ప్లీజ్‌ అండి...ఒక్కసారి మాట్లాడండి... మీతో మాట్లాడాలి’ అని వాయిస్‌ మెసేజ్‌ చేసింది. అయితే భర్త ‘నేను టైర్‌ అయ్యాను. ఇప్పుడు మాట్లాడలేన’ని తిరిగి మెసేజ్‌ పెట్టాడు. దీంతో అరుణ భర్తకు వీడియో కాల్‌ చేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా మళ్లీ వేధింపు మాటలు రావడంతో ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’నని చెప్పి వీడియో కాల్‌ను లైవ్‌లోనే ఉంచి ఆమె ఉరి పోసుకుంది.  పెరుమాళ్లు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి ఇండియాలోని అరుణ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయి గదిలో ఆత్యహత్యాయత్నం చేస్తోంది’ అని సమాచారం ఇచ్చారు. తక్షణమే ఆమె ఉన్న గది తలుపులు తట్టగా అవి గడియ పెట్టి ఉండడంతో పగలగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే అరుణ ఫ్యాన్‌ కొక్కానికి ఉరితో వేలాడుతూ ఉంది. వెంటనే ఆమెను కిందికి దించారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top