
యాంకర్‌తో రాసలీలలు జరపొచ్చనే ఆశతో జయరామ్..
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డినే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్‌రెడ్డి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగగా అతడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
జనవరి 30నే జయరామ్‌ను మహిళా యాంకర్ పేరుతో నిందితుడు రాకేష్ రెడ్డి ట్రాప్ చేశాడు. డ్రైవర్, గన్‌మెన్ లేకుండా ఇంటికి రావాలని జయరామ్‌ను కోరాడు. యాంకర్‌తో రాసలీలలు జరపొచ్చనే ఆశతో జయరామ్ జూబ్లీహిల్స్‌లోని రాకేష్ ఇంటికి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు. ఇలా ఇంట్లోకి వచ్చిన జయరామ్‌ను రాకేష్ తాళ్లతో బంధించాడు. డబ్బులు ఇస్తావా.. ఇవ్వవా అంటూ జయరామ్ ఛాతిపై పిడిగుద్దులు గుద్దుతూ.. దిండుతో ఊపిరి ఆడకుండా చేశాడు. ఇలా దాదాపు 19 గంటల పాటు జయరామ్‌ను బందీగా ఉంచిన రాకేష్.. 12 గంటలపాటు చిత్రహింసలకు గురిచేసాడు. దీంతో జయరామ్ జనవరి 31న 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందాడు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు రాకేష్ మృతదేహాన్ని రెండు కార్లలో షిఫ్ట్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.