ఓటుకు కోట్లు కేసును శీఘ్రంగా విచారించాలి 

Alla Ramakrishna Reddy Requested Supreme Court For the Second Time about Cash For Vote Case - Sakshi

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి

రెండోసారి సుప్రీంను అభ్యర్థించిన ఎమ్మెల్యే ఆళ్ల 

ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారించాలని ఆదేశించినా కేసు ఇప్పటివరకు లిస్ట్‌ కాలేదని నివేదన 

ఇది వినాల్సిన కేసు (ఓటుకు కోట్లు). పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తాం.. 
– 2017 మార్చి 6న జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య 

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. కేసును 2019 ఫిబ్రవరిలో విచారిస్తామంటూ  2018 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు కేసు విచారణకు రాలేదని,  శీఘ్రగతిన విచారించాలని అభ్యర్థించారు. ఆళ్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్‌ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.  

ఏడాది క్రితం సుప్రీం ఉత్తర్వులు.. 
ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్‌లో ప్రతివాదులైన నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి 2017 మార్చి 6న సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తర్వాత ఈ పిటిషన్‌ విచారణకు రాలేదు. త్వరగా విచారించాలని కోరుతూ ఆళ్ల తొలిసారి శీఘ్ర విచారణ పిటిషన్‌ దాఖలు చేయగా 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డితో కూడిన ధర్మాసనం 2018 నవంబరు 2న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ  ఇప్పటి వరకు పిటిషన్‌ విచారణకు రాలేదు. 

2017లో నోటీసులు జారీ చేసినా... 
‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు పాత్రపై అధికారులు దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ 2016 ఆగస్టు 8న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని అదే ఏడాది ఆగస్టు 29న ఏసీబీని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ చంద్రబాబు 2016 సెప్టెంబర్‌ 1న హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2017 మార్చి 6న ప్రతివాదులైన తెలంగాణ  ప్రభుత్వం,  నాటి సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇది వినాల్సిన కేసని.. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తామని పేర్కొంటూ ఆ సమయంలో నోటీసులు జారీ చేసింది. 

విచారణకు రాని పిటిషన్‌
2017 మార్చి 6న సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై తగినంత ఆసక్తి చూపడంలేదని, ప్రతివాదులు పలుకుబడి కలిగిన వారైనందున ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేయవచ్చని పిటిషనర్‌ తొలిసారి శీఘ్ర విచారణ కోరిన సమయంలో నివేదించారు. వీటితోపాటు మరో కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా రెండోసారి శీఘ్ర విచారణ పిటిషన్‌ దాఖలుచేశారు. 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు కేసు లిస్ట్‌ కాలేదని... పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు రిజిస్ట్రీలో విచారించినా ఫలితం లేదన్నారు. దీన్ని విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడానికి కారణాలు తెలియడం లేదని నివేదించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top