
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు సరిచూసుకోకుండా తనకు సంబంధించి ఓ అభ్యంతరకరమైన ఇంటర్వ్యూను నెట్‌లో ఉంచిన ఓ యూట్యూబ్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని సినీనటి అపూర్వ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వక ఫిర్యాదు చేశా రు. వివరాలు.. అపూర్వకు భర్త సత్యనారాయణకు మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా కేసులు నడుస్తున్నాయి.
సత్యనారాయణ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అనుచరుడిగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్వస్థలంలోని ఆమె భర్తకు సంబంధించిన ఆస్తి దగ్ధమైంది. ఈ పని తన భార్య అపూర్వ చేసిందని ఆరోపిస్తూ సత్యనారాయణ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మరికొన్ని అభ్యంతరకర అంశాలూ పేర్కొన్నారు. ఈ వీడియోపై స్పందించిన అపూర్వ తనకు సంబంధించిన ఆరోపణల విషయంలో తన వివరణ తీసుకోకుండా, ఏకపక్షంగా నెట్‌లో వీడియోను ఎలా ఉంచుతారని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు ప్రశాంతంగా ఉండనీయట్లేదు..
‘దెందులూరులో మా ఇంటి ముందు టీడీపీ దిమ్మె కడుతుంటే నేను అడ్డుకున్నాను. దీంతో చింతమనేని అనుచరులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా భర్త కూడా చింతమనేని అనుచరుడే. టీడీపీ నేతలు నన్ను ప్రశాంతంగా ఉండనీయట్లేదు. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని అపూర్వ కోరారు.