రెండు కార్లను ఢీకొని.. నేరుగా టోల్‌బూత్‌లోకి..

Accident At Toopran Toll Plaza - Sakshi

వరంగల్‌ సీపీ విశ్వనాథ్‌ రవీందర్‌కు తప్పిన ప్రమాదం

ఆయన మేనకోడలు అనిత మృతి

మరో నలుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘటన

తూప్రాన్‌ : భారీ కంటైనర్‌ లారీ బీభత్సం సృష్టిం చింది. టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లిస్తున్న రెండు కార్లను ఢీకొని టోల్‌బూత్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందగా నలుగురు టోల్‌ప్లాజా సిబ్బందికి తీవ్ర గాయాల య్యాయి. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం అల్లా పూర్‌ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురు వారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది.

నేరుగా టోల్‌బూత్‌లోకి..
కుటుంబ సభ్యులతో కలసి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి రెండు కార్లలో హైదరాబాద్‌కు వెళ్తున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌.. టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లించేందుకు ఆగారు. ఈ క్రమంలో నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీ టోల్‌బూత్‌లోకి అతివేగంగా దూసు కెళ్లింది. ఆపి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి వెనుక ఉన్న కారు బోల్తాపడింది. దీంతో రవీందర్‌ మేనకోడలు అనిత (49)కు తీవ్ర గాయాలయ్యాయి. రవీందర్‌ పిల్లలు రాహుల్, సుష్మ, వర్ష గాయపడ్డారు. రవీందర్‌ ముందు ఉన్న కారులో ఉండటంతో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. రెండు కార్లను ఢీకొట్టిన అనంతరం.. లారీ నేరుగా టోల్‌బూత్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సిబ్బం ది నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రవీందర్‌ మేనకోడలు అనితను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

కళ్లలోకి ఇనుప చువ్వలు..
ప్రమాదంలో టోల్‌ సిబ్బంది అమిత్‌ కుమార్‌ శర్మ కళ్లలోకి ఇనుప చువ్వలు గుచ్చుకున్నాయి. దీం తో కళ్లలోంచి తీవ్ర రక్తస్రావం అయింది. స్వామి అనే వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోయాయి. గోవింద గుప్తా, జయరాజ్‌లకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్షతగా త్రులను హైవే ఆంబులెన్స్‌లో యశోద, నిమ్స్‌ ఆస్ప త్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్‌ కుమార్‌శర్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రమాదానికి కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత లారీని ఘటనా స్థలంలోనే వదిలి డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో టోల్‌ ప్లాజా వద్ద సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల నుంచి టోల్‌ రుసుము తీసుకోకుండానే పంపించి వేశారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top