ఏసీబీ వలలో సీఐ, ఏఎస్‌ఐ

ACB Caught CI And ASI in While Demanding Bribery Hyderabad - Sakshi

రూ.1.2 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయారు

షాబాద్‌(చేవెళ్ల): భూతగాదా కేసులో రూ.1.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీఐ, ఏఎస్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో గురువారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన మేరకు.. షాబాద్‌ మండల పరిధిలోని చిన్న సోలిపేట్‌కు చెందిన వెంకన్నగారి విజయ్‌మోహన్‌రెడ్డి అలియాస్‌ (జయరాంరెడ్డి), ఇదే గ్రామానికి చెందిన భారతమ్మ మధ్య.. కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది.

ఈ విషయంలో విజయ్‌మోహన్‌రెడ్డిపై పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంలో తనకు సాయం చేస్తామని సూచించిన.. షాబాద్‌ సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌ తమకు డబ్బు ఇవ్వాలని విజయ్‌మోహన్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం వీరి మధ్య రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం విజయ్‌మోహన్‌రెడ్డి ఏఎస్‌ఐ రాజేందర్‌తో కలిసి సీఐకి లంచం ఇచ్చేందుకు వెళ్లాడు. బయట ఏఎస్‌ఐకి డబ్బు ఇవ్వాల్సిందిగా సూచించడంతో పీఎస్‌ ఆవరణలోనే విజయ్‌మోహన్‌రెడ్డి నగదు అందించాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడిచేసి డబ్బు స్వాధీనం చేసుకుని సీఐ, ఏఎస్‌ఐని అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top