పురుషోత్తం రెడ్డి కేసులో కీలక పరిణామం

ACB ASP Ashok Kumar Suspended In Purushotham Reddy Case - Sakshi

సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న కారణంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిల్డింగ్ సూపర్ వైజర్ చేరిన పురుషోత్తం రెడ్డి అనంతర కాలంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఆయన భారీ అవినీతికి పాల్పడుతున్నాడని 2009 నుంచే ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఈ ఫిబ్రవరిలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో తొలుత పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఫిబ్రవరి 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టగా హెచ్‌ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డి అక్రమాలు, అవినీతికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌ సహకరించారని తేలింది.

కాగా, ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్‌ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top