breaking news
HMDA Town Planning
-
ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై వేటు
-
పురుషోత్తం రెడ్డి కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పురుషోత్తం రెడ్డికి సహకరించారన్న కారణంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిల్డింగ్ సూపర్ వైజర్ చేరిన పురుషోత్తం రెడ్డి అనంతర కాలంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఆయన భారీ అవినీతికి పాల్పడుతున్నాడని 2009 నుంచే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రూ.వందల కోట్లు అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నారన్న ఆరోపణలతో ఈ ఫిబ్రవరిలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు పురుషోత్తం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. దీంతో తొలుత పురుషోత్తం పరారు కాగా, అతని బినామీలు యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఫిబ్రవరి 16న ఏసీబీ కోర్టులో లొంగిపోగా చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టగా హెచ్ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డి అక్రమాలు, అవినీతికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ అశోక్‌కుమార్ సహకరించారని తేలింది. కాగా, ఈ కేసులో ఏసీబీ రూ.50 కోట్లకుపైగా బినామీ పెట్టుబడులను గుర్తించింది. నాలుగు కమర్షియల్ కాంపెక్సులు, వ్యవసాయ భూమికి సంబంధించి రూ.20 కోట్ల మేర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. పురుషోత్తం అల్లుడు చేపట్టిన విల్లాల నిర్మాణానికి సంబంధించి రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. కూతురికి ఇచ్చిన ఆభరణాలు, గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తుల విలువ మరో రూ.10 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
సానుకూల భావాల్లో సరికొత్తదనం
మట్టిలో పుట్టిన మాణిక్యాల్లాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదు. హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న కొత్త శ్రీనివాస్ అలాంటి అరుదైన మేలిమి మాణిక్యం. నిరుపేద నేపథ్యంలో పుట్టి పెరిగినా కేవలం కృషినే నమ్ముకుని, అనుభవాల పునాదులపై ఎదిగారు ఆయన. ఒకవైపు ప్రభుత్వాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు సానుకూల భావనలతో కూడిన తన అనుభవ సారాంశాన్ని క్యాలండర్ కవితలుగా అందిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా, ప్రముఖుల మన్ననలు కూడా పొందగలగడం విశేషం. కవిత్వం, చిత్రకళ, సంగీతం వంటి లలిత కళలపై బాల్యం నుంచి ఆయనకు ఆసక్తి మెండు. అయితే, కళాసాధనకు మాత్రమే పరిమితం కాకుండా సేవారంగంలోనూ ఇతోధికంగా కృషి సాగిస్తున్న కొత్త శ్రీనివాస్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. క్యాలండర్ కవిత్వం ఓ కొత్త ఒరవడి కొత్త శ్రీనివాస్ గత రెండేళ్లుగా క్యాలండర్ కవిత్వాన్ని తీసుకొస్తున్నారు. సానుకూల భావనలతో కూడిన సందేశాత్మక చిరు కవితలు, వాటికి తగిన ఫొటోలతో ఆయన రూపొందించిన క్యాలెండర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘‘ఒకప్పుడు కవిత్వం గ్రంథస్థమై ఉండేది. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలోనూ కవిత్వం కనిపిస్తోంది. ప్రధానమంత్రి ‘మన్‌కీ బాత్’ కూడా ఒకరకమైన కవిత్వమే. అయితే, ఈ క్యాలెండర్ కవిత్వం చిత్రమైనది. ఫేస్బుక్, ట్విట్టర్ కవిత్వాన్ని వాటిని మూసేస్తే మళ్లీ చూడలేం. ఈ క్యాలెండర్ కవిత్వం మాత్రం మనకు ఏడాది పొడవునా అలా దర్శనమిస్తూనే ఉంటుంది. కొత్త శ్రీనివాస్ క్యాలెండర్ కవిత్వం ఒక వినూత్న ప్రయోగం’’ అని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందించడం విశేషం. క్యాలెండర్ కవిత్వంలోని ‘కొత్త’దనంపై ప్రశంసలు కురిపించిన వారిలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర, హెచ్ఎండీఏ డైరెక్టర్ కె.విద్యాధర్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఒడిదుడుకుల నేపథ్యం కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించారు శ్రీనివాస్. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లోనే శ్రీనివాస్ చదువు సాగింది. ఆయన తొమ్మిదో తరగతికి వచ్చే వరకు ఇంట్లో కనీసం కరెంటు కూడా లేని పరిస్థితి. ఇంటర్ వరకు కాలేజీకి నిక్కర్తోనే వెళ్లాల్సిన పరిస్థితుల్లో చదువు సాగించారంటే ఆయన పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పద్దెనిమిదేళ్ల వయసులోనే కరీంనగర్ మునిసిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరారు. కష్టాలకు ఎదురీదుతూనే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. క్రమక్రమంగా ఉద్యోగపర్వంలో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. అయితే, విద్యార్థి దశలో ఉండగానే ఆయనకు కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం వంటి లలితకళలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వివిధ పత్రికల్లో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. సేవామార్గంలోనూ కృషి కొత్త శ్రీనివాస్ తన మూలాలను మరువని వ్యక్తి. అందుకే ఆయన సామాజిక బాధ్యతను విస్మరించకుండా సేవారంగంలోనూ కృషి కొనసాగిస్తున్నారు. ఆదరణకు నోచుకోని పలు దేవాలయాల జీర్ణోద్ధరణకు పాటుపడ్డారు. దేవతా ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ స్థాపన, ఆలయ సోపానమార్గ నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టారు. శుభదినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలలో, అనాథాశ్రమాలలో అన్న, వస్త్ర దానాలు చేస్తూ వస్తున్నారు. పేద విద్యార్థుల చదువులకు సాయం కొనసాగిస్తున్నారు.