3 రోజులు... 30 సార్లు!

6 lakhs robbery from bank account - Sakshi

తనకు వచ్చిన ఓటీపీ చెప్పేసిన వృద్ధుడు 

బ్యాంకు ఖాతా నుంచి రూ.6 లక్షలు స్వాహా 

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ కాల్, ఎస్సెమ్మెస్, ఈ–మెయిల్స్‌ ద్వారా ఎరవేసి అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. సైబర్‌ క్రిమినల్స్‌ చేతిలో రూ.6 లక్షలు మోసపోయిన ఓ వృద్ధుడు శుక్రవారం సిటీ సీసీఎస్‌ అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. తన ఫోన్‌కు వచ్చిన వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ను(ఓటీపీ) ఏకంగా 30 సార్లు నేరగాళ్లకు చెప్పేయడం గమనార్హం. చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన మోహన్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొంది భార్యతో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల ఆయనకు ఓ నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. కాల్‌ చేసిన కేటుగాళ్లు తాము బ్యాంకు అధికారులమంటూ పరిచయం చేసుకుని, మీ డెబిట్‌ కార్డ్‌ వివరాలను అప్‌డేట్‌ చేయాలని చెప్పి కార్డు నంబర్, సీవీవీ కోడ్‌తో పాటు ఇతర వివరాలు తీసుకున్నారు.

ఆ వివరాలతో బాధితుడి బ్యాంకు ఖాతాలోకి యాక్సిసయ్యారు. మళ్లీ ఫోన్‌ చేసి కార్డు అప్‌డేషన్‌ దాదాపు పూర్తయిందని ఇక ఓటీపీ ఎంటర్‌ చేయడమే మిగిలిందని చెప్పారు. మీ ఫోన్‌కు వచ్చే ఆ నంబర్‌ చెప్పాలంటూ కోరారు. మోహన్‌ అలానే చేయడంతో ఆయన ఖాతాలోని డబ్బు స్వాహా చేయడం మొదలు పెట్టారు. ఇలా 3 రోజుల్లో దాదాపు 30 సార్లు ఓటీపీలు తెలుసుకుని బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.6 లక్షలు వివిధ ఈ–కామర్స్‌ యాప్స్‌తో పాటు పేటీఎంలోకి మళ్లించుకున్నారు. ఎట్టకేలకు విషయం గుర్తించిన మోహన్‌ శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏసీపీ విజయ్‌ ప్రకాశ్‌ తివారీ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరగాళ్లు జార్ఖండ్‌ కేంద్రంగా కథ నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో పాటు ఈ–కామర్స్‌ యాప్స్‌ ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళుతున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top