అట్టుడుకుతున్న కన్నూర్‌

1800 arrested in Sabarimala violence - Sakshi

శబరిమల వ్యవహారంలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల పరస్పర దాడులు

చట్టాన్ని గౌరవించాలని ఐరాస విజ్ఞప్తి

కన్నూర్‌/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్‌ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి  2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది.

పలుచోట్ల బాంబు దాడులు
సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్‌ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్‌ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్‌ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్‌ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్‌ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్‌ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top