
సాక్షి, తిరుమల: తిరుమల వైకుంఠ క్షేత్రంలో ఈసారి ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులు పోటెత్తడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్తులో తిరుమల కొండపై రద్దీని నియంత్రించాలంటే టైంస్లాట్ విధానమే పరిష్కార మార్గమనే సూచనలు వస్తున్నాయి.
సామాన్య భక్తులు శుక్ర, శనివారాల్లో నరకయాతన అనుభవించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ టైంస్లాట్ విధానంపై పడింది. రూ.300 టికెట్లు, సర్వదర్శనం, కాలిబాట దర్శనాలకు అమలుచేస్తున్నట్లుగానే పర్వదినాల్లోనూ టైంస్లాట్ విధానమే రద్దీ సమస్యకు ఏకైక పరిష్కారమని నిపుణులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంవల్ల ఆరు బయట ఎలాంటి క్యూలైన్లు ఉండవు. ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయాల్లో మాత్రమే క్యూలోకి వచ్చి కనిష్టంగా 2 గంటలు గరిష్టంగా 4 గంటల్లోపే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది.
పర్వదినాల్లో టైంస్లాట్‌ను పరిశీలిస్తున్నాం: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
ప్రస్తుతం శ్రీవారి దర్శనంలో రూ.300 టికెట్లు, సర్వదర్శనం, కాలిబాట దర్శనాలకు టైంస్లాట్ పద్ధతిని అమలుచేస్తున్నాం. పర్వదినాల్లో కూడా ఈ విధానం ఎంతవరకు వీలవుతుందో? ఎంతమంది భక్తులకు టికెట్లు లభిస్తాయి? ఆన్‌లైన్ టికెట్లు పొందలేని వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? అన్న విషయాలు పరిశీలిస్తున్నాం.