సమీపకాలం ‘బంగారమే’!

World Gold Council believes gold will become more relevant in 2019 - Sakshi

ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి డాలర్‌ వరకూ..

పసిడి డిమాండ్‌ పెరుగుదలకు దోహదం

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా

ముంబై: బంగారం డిమాండ్‌ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది.   ఈ ఏడాది (2019) డిమాండ్‌ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్‌ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్‌ కదలికల వంటి అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► ఒడిదుడుకుల ఫైనాన్షియల్‌ మార్కెట్ల సమయంలో సహజంగా పసిడి పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచం మొత్తంగా పసిడి డిమాండ్‌ చూస్తే,  చైనా, భారత్‌సహా పలు వర్థమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది.  

► గత రెండేళ్లలో ప్రపంచంలో నెలకొన్న పలు అనిశ్చితి ఆర్థిక అంశాల ప్రభావం 2018 చివర్లో స్పష్టంగా కనిపించింది. ఇదే పరిస్థితితో 2019 సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆయా అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్‌లో పసిడి డిమాండ్‌ పెరుగుదలకే కొంత మొగ్గు ఉంది.  

► మార్కెట్‌ అనిశ్చితి కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇది పసిడికి సానుకూల అంశమే.

► ఈ సందర్భంగా పసిడికి ప్రతికూలమైన వడ్డీరేట్ల పెరుగుదల, డాలర్‌ పటిష్టతను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫెడ్‌ వడ్డీరేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) పెంపు స్పీడ్‌ తగ్గే అవకాశాలే కనిపిస్తుండటం పసిడికి సానుకూల అంశమే.  

► వృద్ధి పెరిగినా, ఆ ఫలాలు అందరికీ అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది పసిడి సెంటిమెంట్‌ను బలపరిచే అంశమే.  

► ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇదేరీతిన కొనసాగితే, 2019లో పసిడి ఆభరణాలకూ డిమాండ్‌ పటిష్టమవుతుందని కౌన్సిల్‌ భావిస్తోంది.  

► పశ్చిమ దేశాల్లో వృద్ధి ధోరణి... వినియోగ సెంటిమెంట్‌ను బలపరిచే అంశం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top