ఆటో సంక్షోభంతో కార్మికుల ఉక్కిరిబిక్కిరి

Workers Hit Hard By Ashok Leylands Shutdown - Sakshi

చెన్నై : ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్రస్ధాయికి చేరుకుంది. కార్లు, బైక్‌లతో పాటు కమర్షియల్‌ వాహన విక్రయాలు పడిపోవడంతో ఆటోమొబైల్‌ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. మారుతి సుజుకి ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేయగా, ఆటో దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ ఈ నెలలో 5 నుంచి 18 రోజుల పాటు ప్లాంట్ల మూసివేతతో ఉత్పత్తిలో కోత విధించింది. అశోక్‌ లేలాండ్‌ నిర్ణయంతో ఆయా ప్లాంట్లలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది.

కంపెనీ నిర్ణయంతో సెప్టెంబర్‌లో తనకు రూ 13,000 రావాల్సి ఉండగా కేవలం రూ 4000 మాత్రమే చేతికి అందుతాయని చెన్నైలోని ఎన్నోర్‌ ప్లాంట్‌లో పనిచేసే మురళి అనే కాంట్రాక్టు కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం తన ఇంటి అద్దెకు మాత్రమే సరిపోతాయని చెప్పుకొచ్చాడు. జీతం డబ్బుల్లో కోత పడుతుండటంతో తన పది నెలల చిన్నారితో పాటు తన భార్యను ఆమె పుట్టింటికి పంపానని తనకు పూర్తి జీతం రూ 13,000 వచ్చినా తాను కుటుంబాన్ని నెట్టుకురాలేకపోతున్నానని, ఆ జీతంలోనూ కోతపడితే తాను ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. చెన్నై ప్లాంట్‌లోనే మురళి వంటి కాంట్రాక్టు కార్మికులు మూడు వేల మంది వరకూ పనిచేస్తున్నారు. వీరంతా నో వర్క్‌..నో వేజెస్‌ ప్రాతిపదికనే పనుల్లో కొనసాగుతున్నారు.

ఈ జీతంతో బతికేదెలా..?
శాశ్వత ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధిస్తున్నారని..అలవెన్సులు, ఇన్సెంటివ్‌ల్లోనూ కోత పెట్టేందుకు కంపెనీ సన్నద్ధమవుతోందని సురేష్‌ అనే మరో ఉద్యోగి వాపోయారు. తనకు స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారని, నెలవారీ బడ్జెట్‌లో భారీ కోత పడితే ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రోజుకు రెండు పాల ప్యాకెట్లకు బదులు ఒక ప్యాకెట్‌తోనే సర్ధుకుంటున్నామని, గతంలో వారానికి రెండు సార్లు మాంసాహారం తీసుకునేవాళ్లమని, ఇప్పుడు ఒకసారికే పరిమితమవుతున్నామని చెప్పుకొచ్చారు. ఈ నెలలో తమకు కేవలం ఎనిమిది రోజులే పని ఉందని, 16 రోజులు సెలవలు ఇచ్చారని వచ్చే నెల అంటేనే తాము భయపడుతున్నామని ఆవేదన చెందారు.

పరిహారం ప్రకటించాలి

పనిలేక పస్తులుంటున్న కార్మికులకు పరిహారం ప్రకటించి ఆదుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామన్‌ అశోక్‌ లేలాండ్‌ను కోరారు. గత ఏడాది కంపెనీకి రూ 1983 కోట్ల లాభం వచ్చిందని..ఇక సంక్షోభం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కంపెనీ తమ కోసం, తమ వాటాదారుల కోసం లాభాలు దండుకోవాలని చూస్తూ కార్మికుల ప్రయోజనాలను గాలికివదిలేసిందని మండిపడ్డారు. మరోవైపు అశోక్‌ లేలాండ్‌ వాహన విక్రయాలు సగానికి పైగా పతనమయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో 16,628 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది ఆగస్ట్‌లో వాహన విక్రయాలు 50 శాతం పడిపోయి కేవలం 8,296 యూనిట్లకు పరిమితమయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, భారత్‌ సిక్స్‌ ప్రమాణాలకు మారడం, ఎలక్ర్టానిక్‌ వాహనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలైంది. ఆటోమొబైల్‌ పరిశ్రమపై విధించే 28 శాతం జీఎస్టీని తగ్గించాలని, ఎలాంటి నియంత్రణలు లేకుండా వాహన రుణాలను విరివిగా మంజూరు చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top