11% తగ్గిన పండుగ వాహన విక్రయాలు

Vehicle sales 11 percent decrease - Sakshi

నిస్సారంగా పండుగల సీజన్‌  

పీవీ, టూ వీలర్ల అమ్మకాలు డౌన్‌ 

ప్రభావం చూపిన ఎన్‌బీఎఫ్‌సీల  లిక్విడిటీ సమస్య  

ఫాడా వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా వాహన కంపెనీల రిటైల్‌ అమ్మకాలు ఈ ఏడాది పండుగల సీజన్‌లో 11 శాతం తగ్గాయి. ప్రయాణికుల వాహనాలు, టూ–వీలర్ల అమ్మకాలు బలహీనంగా ఉండటమే దీనికి కారణమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌(ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. గత కొన్నేళ్లలో పండుగల సీజన్‌ ఇంత నిస్సారంగా ఉండడం చూడలేదని ఫాడా ప్రెసిడెంట్‌ అశీష్‌ హర్షరాజ్‌ కాలే పేర్కొన్నారు. ఇంధనం ధరలు అధికంగా ఉండటం, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిధుల కొరత తీవ్రంగా ఉండటం, బీమా వ్యయాలు పెరగడం, వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం.. వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించారు. వాహన విక్రయాలకు ఎన్‌బీఎఫ్‌సీలు కీలకమని, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలని ఆర్‌బీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.  
ఫాడా వెల్లడించిన వివరాల ప్రకారం..,  
∙రిటైల్‌ అమ్మకాలను రిజిస్ట్రేషన్ల ప్రాతిపదికగా గణిస్తారు. టూ వీలర్లు, ప్రయాణికుల వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఈ సెగ్మెంట్లో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన నిల్వలు డీలర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.  గత ఏడాది పండుగల సీజన్‌లో 23,01,986గా ఉన్న మొత్తం  రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది పండుగల సీజన్‌లో 20,49,391కు పడిపోయాయి. ఇక ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్లు 3,33,456 నుంచి 2,87, 717కు తగ్గాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్లు 18,11,703 నుంచి 13 % తగ్గి 15,83,276కు పడిపోయాయి.   అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ వాహన రిటైల్‌ అమ్మకాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 20 వరకూ 1,12,54,305గా ఉన్న వాహన రిటైల్‌ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 7 శాతం పెరిగి 1,19,89,705కు పెరిగాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top