పండుగ సేల్స్‌ @ 6 లక్షల కోట్లు! | India e-commerce sees 24 percent order surge this Diwali | Sakshi
Sakshi News home page

పండుగ సేల్స్‌ @ 6 లక్షల కోట్లు!

Oct 22 2025 4:20 AM | Updated on Oct 22 2025 8:12 PM

 India e-commerce sees 24 percent order surge this Diwali

దీపావళి రిటైల్‌ అమ్మకాల ధమాకా..

24 శాతం పెరిగిన ఈ–కామర్స్‌ ఆర్డర్లు 

క్విక్‌ కామర్స్‌ జోరు

న్యూఢిల్లీ: ఇటీవలి జీఎస్‌టీ సంస్కరణలు, కొనుగోలుదారుల సానుకూల సెంటిమెంటు దన్నుతో దీపావళి పండుగ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. విక్రయాలు రూ. 6.05 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ వెల్లడించింది. ఇందులో రూ. 5.40 లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు, రూ. 65,000 కోట్ల విలువ చేసే సర్వీసులు ఉన్నట్లు తెలిపింది. గతేడాది దీపావళి విక్రయాలు రూ. 4.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

వివిధ రాష్ట్రాల రాజధానులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 60 కీలక పంపిణీ కేంద్రాలవ్యాప్తంగా సీఏఐటీ రీసెర్చ్‌ వింగ్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాకేజింగ్, ఆతిథ్యం, క్యాబ్‌ సరీ్వసులు, ట్రావెల్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డెలివరీ విభాగాల్లో రూ. 65,000 కోట్ల మేర విక్రయాలు నమోదైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్తియా తెలిపారు. శీతాకాలం, వివాహాల సీజన్‌తో పాటు జనవరి మధ్య నుంచి మొదలయ్యే పండుగల సీజన్‌లోను ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

ఎఫ్‌ఎంసీజీ, ఆభరణాలకు డిమాండ్‌.. 
2025 దీపావళి సందర్భంగా లాజిస్టిక్స్, ప్యాకేజింగ్‌ తదితర విభాగాల్లో 50 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం వ్యాపారంలో గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాల వాటా సుమారు 28 శాతంగా నమోదైంది. సీఏఐటీ నివేదిక ప్రకారం.. మొత్తం అమ్మకాల్లో వాటాలపరంగా చూస్తే నిత్యావసరాలు..ఎఫ్‌ఎంసీజీ వాటా 12 శాతంగా, బంగారం.. ఆభరణాలు 10 శాతంగా, ఎల్రక్టానిక్స్‌..ఎలక్ట్రికల్స్‌ 8 శాతంగా, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌.. రెడీమేడ్‌ దుస్తులు..గిఫ్ట్‌ ఐటమ్‌లు మొదలైన వాటి వాటా తలో 7 శాతంగా నమోదైంది. మరోవైపు, గతేడాదితో పోలిస్తే మొబైల్స్, ఎల్రక్టానిక్స్, భారీ ఉపకరణాలు, ఫ్యాషన్‌ విక్రయాలు భారీగా పెరిగినట్లు ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రతీక్‌ శెట్టి తెలిపారు. జెనరేషన్‌ జెడ్‌ (1997–2012 మధ్య జన్మించినవారు) నుంచి డిమాండ్‌ గణనీయంగా నెలకొన్నట్లు వివరించారు.  

మార్కెట్‌ప్లేస్‌ మెరుపులు: యూనికామర్స్‌  
ఈసారి దీపావళి పండుగ సీజన్‌లో ఈ–కామర్స్‌కి సంబంధించి ఆర్డర్ల పరిమాణం వార్షికంగా 24 శాతం, స్థూల కొనుగోళ్ల విలువ (జీఎంవీ) 23 శాతం మేర పెరిగినట్లు యూనికామర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక క్విక్‌ కామర్స్‌ యాప్‌ల ద్వారా ఆర్డర్ల పరిమాణం 120 శాతం ఎగియగా, బ్రాండ్‌ వెబ్‌సైట్లలో ఆర్డర్లు 33 శాతం పెరిగాయి. మొత్తం కొనుగోళ్లలో 38 శాతం వాటా, 8 శాతం ఆర్డర్ల పరిమాణం వృద్ధితో మార్కెట్‌ప్లేస్‌ల (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటివి) ఆధిపత్యం కొనసాగింది. 2024, 2025 సంవత్సరాల్లో 25 రోజుల పండుగ సీజన్‌ వ్యవధిలో తమ ఫ్లాగ్‌షిప్‌ ప్లాట్‌ఫాం యూనివేర్‌ ద్వారా జరిగిన 15 కోట్లకు పైగా లావాదేవీల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించినట్లు యూనికామర్స్‌ తెలిపింది. మరిన్ని విశేషాలు... 

 ఎఫ్‌ఎంసీజీ (డ్రైఫ్రూట్‌ కాంబో ప్యాక్‌లు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు), గృహాలంకరణ..ఫరి్నచర్, సౌందర్య సంరక్షణ..ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యం.. ఫార్మా (సప్లిమెంట్లు మొదలైనవి) అత్యధికంగా అమ్మకాలు నమోదైన కేటగిరీల్లో నిల్చాయి.  
చిన్న పట్టణాల్లో కూడా డిజిటల్‌ వినియోగం, కొనుగోలు శక్తి పెరుగు తోందనడానికి నిదర్శనంగా మొత్తం ఆర్డర్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 55 శాతంగా నమోదైంది. ప్రాంతీయంగా ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఆర్డర్లు 28 శాతం, పెద్ద నగరాల్లో 24 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 23 శాతం మేర పెరిగాయి.  

డిజిటల్‌ లావాదేవీలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తూ ప్రీపెయిడ్‌ ఆర్డర్లు 26 శాతం పెరగ్గా, క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) ఆర్డర్ల పరిమాణం 22 శాతం.. విలువ 35 శాతం మేర పెరిగాయి.  
 యూనికామర్స్‌ లాజిస్టిక్స్‌ ప్లాట్‌ఫాం షిప్‌వే డేటా ప్రకారం ఈ ఏడాది డెలివరీలు చాలా వేగవంతమయ్యాయి. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం తక్కువ వ్యవధిలోనే డెలివరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement