మూడేళ్లలో వేదాంత రూ. 60,000 కోట్ల పెట్టుబడి

Vedanta set to invest Rs 60,000 cr in India over 3 yrs - Sakshi

ముంబై: వేదాంత కంపెనీ రానున్న 2–3 ఏళ్లలో రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. రానున్న 4– 5 ఏళ్లలో 3,000– 4,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వేదాంత రిసోర్సెస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇదే కాలానికి 1,000 కోట్ల డాలర్ల నికర లాభం సాధించడం లక్ష్యమని వివరించారు. ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌ 2019లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.  

మరిన్ని ప్రభుత్వ కంపెనీలను కొంటాం....
భారత్‌లో ఇప్పటిదాకా 3,500 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేశానని అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. గత పదేళ్లలో హిందుస్తాన్‌ జింక్, బాల్కో, సెసగోవా, కెయిర్న్‌ తదితర మొత్తం 13 కంపెనీలను కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కంపెనీల కార్యకలాపాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ప్రభుత్వ రంగ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం విదేశీయులపై కాకుండా తమలాంటి స్వదేశీ పారిశ్రామికవేత్తలపైనే ఆధారపడాలని ఆయన సూచించారు. విదేశీయులు లాభాపేక్షతోనే వ్యవహరిస్తారని, తమలాంటి స్వదేశీ పారిశ్రామికవేత్తలు మాత్రం దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తారని చెప్పారు. ప్రభుత్వం తమపై ఆధారపడితే విదేశీ పెట్టుబడులు కూడా తేగలమని పేర్కొన్నారు. గ్లాస్,  ఆప్టికల్‌ ఫైబర్, కేబుల్‌ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని ఈ సందర్భంగా చెప్పారాయన. గత ఆరేళ్లలో వివిధ పన్నుల రూపేణా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లు చెల్లించామని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top