వేదాంత రిసోర్సెస్‌  లాభంలో 27 శాతం వృద్ధి 

Vedanta Resources gains 27 per cent growth - Sakshi

న్యూఢిల్లీ: సహజ వనరుల రంగంలో డైవర్సిఫైడ్‌ కంపెనీ, లండన్‌ లిస్టెడ్‌ వేదాంత రిసోర్సెస్‌ నిర్వహణ లాభం 2017–18 ఆర్థిక సంవత్సరంలో 27 శాతం వృద్ధి చెంది 4.1 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అధిక ఉత్పత్తి, పెరిగిన ధరలు కలసివచ్చాయి. ఆదాయం సైతం 33 శాతం పెరిగి 15.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గ్రూపు రుణ భారం 3 బిలియన్‌ డాలర్లు తగ్గి 15.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఫలితాలపై వేదాంత రిసోర్సెస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ... ఉత్పత్తి, ధరలు పెరగడంతో ఆదాయం 33 శాతం వృద్ధి చెందిందని, ఎబిటా 27 శాతం పెరిగిందని వివరించారు.

కమోడిటీ ధరలు పెరగడం, మార్కెట్లు బాగుండటంతో అన్ని విధాలుగా మెరుగైన పనితీరు సాధ్యమైందన్నారు. కొన్ని వ్యాపారాల్లో ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరినట్టు తెలిపారు. భారత్‌లో సహజ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌ను అవకాశంగా మలుచుకునే మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పారు. దేశీయ మార్కెట్లలో లిస్ట్‌ అయిన వేదాంత లిమిటెడ్‌కు వేదాంత రిసోర్సెస్‌ పేరెంట్‌ కంపెనీ. జింక్, వెండి, ఐరన్, కాపర్, బాక్సైట్‌ తదితర లోహాలతో పాటు, చమురు, గ్యాస్‌ ఉత్పత్తిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top