ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

US Fed leaves interest rates unchanged - Sakshi

పాలసీ వడ్డీ రేట్లు యథాతథం..

బాండ్ల కొనుగోళ్లకు బై బై

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయాలు   

వాషింగ్టన్‌: ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటంతో  ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఫండ్స్‌ రేటును ప్రస్తుత స్థాయిల్లోనే (2.25 శాతం నుంచి 2.50 శాతం) కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మొత్తం దాదాపు ఇదే రేటు కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మరోవైపు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌(ఉద్దీపన ప్యాకేజీ–క్యూఈ)ని కూడా పూర్తిగా నిలిపేయనున్నది. ఈ విధానంలో మార్కెట్‌ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలు(బాండ్లు), ఇతర సెక్యూరిటీలను ఫెడరల్‌ రిజర్వ్‌ కొనుగోలు చేస్తుంది.           తద్వారా వ్యవస్థలోకి నిధులు పంపిస్తూ            వడ్డీరేట్లను తక్కువ స్థాయిల్లో ఉండేట్లు చేస్తుంది. ప్రస్తుతం ఫెడరల్‌ రిజర్వ్‌ నెలకు 3,000 కోట్ల డాలర్ల మేర సెక్యూరిటీలను కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి దీనిని నెలకు 1,500 కోట్ల డాలర్లకు తగ్గించనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయనున్నది.  కాగా 2020లో మాత్రం ఫండ్స్‌ రేట్‌ 2.6 శాతానికి పెరగవచ్చని అంచనా.

మరింత స్పష్టత...
ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుందని, అప్పుడు పాలసీ మార్పుపై కూడా స్పష్టత వస్తుందని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యానించారు. రేట్ల పెంపు విషయమై నిర్ణయం తీసుకోవడానికి మరింత ఓపికతో ఎదురుచూస్తామని ఆయన మరోసారి పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మంచి స్థాయిలో ఉందని, ఆర్థిక వ్యవస్థ అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని పావెల్‌ పేర్కొన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం, అమెరికా–చైనాల మధ్య చర్చలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌ తదితర అంశాలు సమస్యాత్మకంగానే ఉన్నాయని, వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని వివరించారు.  

2018లో భారీగా పన్నులు తగ్గించడం, ప్రభుత్వ వ్యయం పెంచడం వల్ల వృద్ధి పుంజుకుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో కుటుంబాల వ్యయాలు తగ్గడం, బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ ఏడాది రేట్లను పెంచకూడదని ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించిందని నిపుణులు అంటున్నారు. గతేడాది 3 శాతంగా ఉన్న అమెరికా వృద్ధి ఈ ఏడాది 2.1 శాతానికే పరిమితం కావచ్చని ఫెడరల్‌ రిజర్వ్‌ అంచనా వేస్తోంది. నిరుద్యోగ రేటు 3.7 శాతంగా,  ద్రవ్యోల్బణం 1.8 శాతంగా ఉండొచ్చన్న అంచనాలను వెలువరించింది.

మార్కెట్లకు బూస్ట్‌....
ఫెడ్‌ ప్రకటన వెలువడగానే బుధవారం అమెరికా స్టాక్‌ సూచీలు దూసుకుపోయాయి. కానీ చివరకు ఆ లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిశాయి. గురువారం హాంగ్‌సెంగ్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు, డ్యాక్స్‌ మినహా మిగిలిన యూరప్‌ మార్కెట్లు కూడా మంచి లాభాల్లో ట్రేడయ్యాయి. గురువారం అమెరికా మార్కెట్లు కూడా మళ్లీ పుంజుకుని భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఊ    ఫెడ్‌ తాజా నిర్ణయాలు మన మార్కెట్లపై బాగానే  ప్రభావం చూపుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాల ప్రకారం... శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు భారీగా లాభపడే అవకాశాలున్నాయి.  
► ఫెడ్‌ నిర్ణయంతో డాలర్‌ ఇప్పటికే పడిపోయింది. దీంతో రూపాయి మరింతగా పుంజుకోవచ్చు.  
► ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండగలదన్న ఫెడ్‌ అంచనాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడికి మరింత డిమాండ్‌ పెరిగే అవకాశాలున్నాయి. బంగారం ధరలు పెరుగుతాయి.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top