ఆంధ్రాబ్యాంక్‌ విలీనానికి ఓకే

Union Bank ok to Merge With Andhra Bank - Sakshi

రూ.17,200 కోట్ల పెట్టుబడుల సమీకరణకు కూడా  

బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన యూనియన్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17,200 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనను కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. సోమవారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.13,000 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. అలాగే అదనపు టైర్‌ వన్‌/టూ బాండ్ల జారీ ద్వారా రూ.4,200 కోట్లు సమీకరిస్తామని వెల్లడించింది.  బ్యాంక్‌ల విలీనానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలపడం, రూ.17,200 కోట్ల మేర నిధులు సమీకరించనుండటం వంటి సానుకూలాంశాల నేపథ్యంలో బీఎస్‌ఈలో యూనియన్‌ బ్యాంక్‌ షేర్‌ 2.2% లాభంతో రూ.56.25 వద్ద ముగిసింది. 

12కు తగ్గనున్న ప్రభుత్వ బ్యాంక్‌లు...
గత నెల 30న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ బ్యాంక్‌ల విలీన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పది బ్యాంక్‌లు విలీనమై నాలుగు  బ్యాంక్‌లుగా అవతరించనున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌లు విలీనమవుతున్నాయి. అలాగే కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం కానున్నాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌లు కొనసాగుతాయి. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గనున్నది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top