అల్ట్రాటెక్ లాభం రూ.723 కోట్లు | UltraTech Cement Q4 net profit rises 10% to Rs 723 crore | Sakshi
Sakshi News home page

అల్ట్రాటెక్ లాభం రూ.723 కోట్లు

Apr 26 2016 12:25 AM | Updated on Sep 3 2017 10:43 PM

అల్ట్రాటెక్ లాభం రూ.723 కోట్లు

అల్ట్రాటెక్ లాభం రూ.723 కోట్లు

ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.723 కోట్ల నికర లాభం ఆర్జించింది.

భారీగా పెరిగిన నికర అమ్మకాలు
లాభంలో 10 శాతం వృద్ధి
ఒక్కో షేరుకి రూ. 9.5 డివిడెండ్

 న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.723 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం రూ.657 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించామని అల్ట్రాటెక్ సిమెంట్ పేర్కొంది. నికర అమ్మకాలు పెరగడంతో నికర లాభం 10 శాతం ఎగసిందని తెలియజేసింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9.5 డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లు ప్రకటించింది.

 తగ్గిన వ్యయాలు
2014-15 క్యూ4లో రూ.6,517 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 2015-16 క్యూ4లో రూ.6,850 కోట్లకు,  మొత్తం వ్యయాలు రూ.5,519 కోట్ల నుంచి రూ.5,857 కోట్లకు  చేరుకున్నాయి. దేశీయంగా సిమెంట్ అమ్మకాలు 15 శాతం పెరిగాయని, గ్రే సిమెంట్ అమ్మకాలు 11.51 మిలియన్ టన్నుల నుంచి 13.2 మిలియన్ టన్నులకు వృద్ధి చెందాయని కంపెనీ తెలియజేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో 43.38 మిలియన్ టన్నులుగా ఉన్న గ్రే సిమెంట్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 46.93 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఇంధనం ధరలు తగ్గడం, పటిష్టమైన నిర్వహణ పనితీరు కారణంగా నిర్వహణ వ్యయాలు తగ్గాయని తెలిపింది.

డిమాండ్ 7-8 శాతం
మౌలిక సదుపాయాల అభివృద్ధి, హౌసింగ్, స్మార్ట్ సిటీలు, తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 7-8 శాతం పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఇది తమకు సానుకూలమైన అంశమని పేర్కొంది. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోగలమని, భారత దేశ తర్వాతి దశ వృద్ధిలో చురుకుగా పాలుపంచుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. తమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 66.3 మిలియన్ టన్నులకు పెరిగిందని, విస్తరణ  కార్యక్రమాలన్నీ అనుకున్నవిధంగానే  జరుగుతున్నాయని తెలిపింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసేందుకు ఆమోదం పొందామని పేర్కొంది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ ధర స్వల్పంగా పెరిగి రూ.3,278 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement