లామినేటెడ్ ఆధార్ కార్డు వాడకండి..!

UIDAI cautions against using plastic, laminated Aadhaar cards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డ్‌ గోప్యత  ప్రశ్నార్థకమవుతున్న వేళ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)తాజా హెచ్చరికలు జారీ చేసింది.   ప్లాస్టిక్ లేదా లామినేటెడ్ ఆధార్ కార్డును వాడవద్దని ప్రజలను హెచ్చరించింది.  వీటి వల్ల  కార్డుదారుల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశముందని తెలిపింది. అంతేకాదు.. అసలు ప్లాస్టిక్ ఆధార్ కార్టులను తీసుకోవద్దని, వాటి వలన ఎలాంటి ఉపయోగం లేదని  స్పష్టం చేసింది. ఈ పనికిరాని కార్డుకోసం  డబ్బులు వృధా చేసుకోవద్దని  సూచించింది. 

ఈ అనధికార ముద్రణ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ చోరీకి గురయ్యే అవకాశం ఉందని దీంతో  మన సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారం లీక్‌అవుతుందని   యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్‌పాండే తెలిపారు. ప్లాస్టిక్‌  ఆధార్‌కార్డు పూర్తిగా  వ్యర్థమని పేర్కొన్నారు.  దీనికి బదులు సాధారణ కాగితంపై డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్‌కార్డు, ఎం-ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్పారు. కొంతమంది  దుకాణదారులు రూ.50 నుంచి 300 వరకు చార్జ్ వసూలు చేస్తూ ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు ఫ్రింట్ చేసి ఇస్తున్నారని..అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పాండే తెలిపారు.

 అన్ని రకాల అవసరాల కోసం వినియోగదారులు ఖచ్చితంగా సాధారణ పేపర్ ప్రింటెడ్ ఆధార్, ఎం-ఆధార్‌లనే వాడాలని సూచించారు.  ఆధార్‌కార్డు పోగొట్టుకున్న సందర్భంలో  https://eaadhaar.uidai.gov.in కి లాగిన్ అయి ఆధార్‌కార్డును ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుల ముద్రణ కోసం ప్రజలు అనధికారిక సంస్థలను  ఆశ్రయించవద్దని కోరారు. అలాగే ఆధార్ కార్డును అనధికారికంగా ప్రచురించడం చట్టప్రకారం నేరమని, జైలు శిక్షకు గురి కావల్సి వస్తుందని  హెచ్చరించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top