కరోనా : ఉబెర్ ఉద్యోగాల కోత

Uber to lay off  employees CEO to forgo base salary - Sakshi

3700 పూర్తికాల  ఉద్యోగులపై వేటు

బేసిక్ వేతనాన్ని వదులుకోనున్న సీఈవో దారా ఖోస్రోషాహి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభానికి ప్రభావితమైన ఉబెర్ టెక్నాలజీస్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా 3,700 పూర్తికాల ఉద్యోగులను తొలగించనుంది. అలాగే ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి మిగిలిన సంవత్సరానికి గాను తన మూల వేతనాన్ని వదులుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో 14 శాతం ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.  ప్రపంచవ్యాప్తంగా  450 డ్రైవర్ సేవా కేంద్రాల్లో 40 శాతం మూసివేస్తోంది.  కోవిడ్-19 మహమ్మారి తమ వ్యాపారాలను నాశనం చేసిందని పేర్కొంది. 

ఇవి చాలా కఠినమైన రోజులు. రాబోయే రెండు వారాల్లో మరిన్ని"కష్టమైన సర్దుబాట్లు" జరుగుతాయంటూ సీఈవో తన ఉద్యోగులకు ఒక ఈమెయిల్ సందేశాన్ని పంపారు. గత ఏడాది జూలై నుండి అక్టోబర్  వరకు పలుమార్లు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి సంస్థ తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేయడం ఆదోళన మరింత ఆందోళన రేపింది. 

కరోనా వైరస్,  లాక్‌డౌన్ కారణంగా యాప్ ఆధారిత రైడింగ్ సేవల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. దీంతో  ఉబెర్ ఖర్చులను తగ్గించుకునే చర్యలకు దిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఉబెర్ కు దాదాపు 20 మిలియన్ డాలర్ల వ్యయాలున్నట్టు అంచనా. మరోవైపు అమెరికాలో ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్ కూడా గత వారం 982 మంది లేదా 17శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దీంతోపాటు ఉన్నతాధికారుల మూల వేతనాలను తగ్గించింది.

కొత్త ప్రత్యర్థులు, ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా అనుసరించాల్సిన వినూత్న బిజినెస్ మోడల్స్ కారణంగా ఉబెర్, లిఫ్ట్ లాంటి  షేరింగ్ క్యాబ్ సంస్థలు భవిష్యత్తులో  కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటాయని వెడ్ బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు డేనియల్ ఇవ్స్ చెప్పారు. ఎందుకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయడం అనేది సాధారణంగా మారిపోవడం, పాటించాల్సిన ఆరోగ్య నిబంధనలు, ఇతర ఆందోళనల కారణంగా ప్రజల వినియోగంలో మార్పు రావచ్చన్నారు. ఈ మందగమనం డ్రైవర్ల ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుందన్నారు. డ్రైవర్లు కాంట్రాక్ట్ కార్మికులుగా మారిపోతారని  అభిప్రాయపడ్డారు.

అయితే బుధవారం, ఉబెర్ కొత్త ఈట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇది రియల్ టైమ్ డెలివరీ ట్రాకింగ్‌తో  ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. తన ఆహార పంపిణీ వ్యాపారంతో కొంత కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి పొందే అవకాశం వుందని భావిస్తున్నారు. మరోవైపు డ్రైవర్లను ఉద్యోగులకు బదులుగా స్వతంత్ర కాంట్రాక్టర్లుగా వర్గీకరించి, కార్మికుల ప్రయోజనాలను నిలిపి వేసిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియా  సహా, అతిపెద్ద మూడు నగరాల్లో ఉబెర్,  లిఫ్ట్‌పై కేసులు నమోదయ్యాయి.  (ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top