
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్స్ వంటి క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం తక్షణ చర్యలు తీసుకునే యోచనేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీలపై అధ్యయనానికి నియమించిన నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాతే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో ఈ విషయాలు తెలియజేశారు. పెట్టుబడుల వెల్లువతో బిట్‌కాయిన్ విలువ రూ.10 లక్షల స్థాయికి పైగా ఎగిసింది.
ఈ నేపథ్యంలో ఇలాంటి క్రిప్టోకరెన్సీలు మోసపూరిత పోంజీ స్కీముల్లాంటివని.. వీటికి దూరంగా ఉండాలని కేంద్రం, ఆర్‌బీఐ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్చువల్ కరెన్సీలు, వాటి ద్వారా మనీలాండరింగ్ అవకాశాలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ, హోం శాఖ, ఆర్‌బీఐ అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.