సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌కు పన్ను మినహాయింపు!

Tax Reduced For Senior Citizen Savings Scheme - Sakshi

ఎస్‌బీఐ ఎకోరాప్‌ సూచన

న్యూఢిల్లీ: పెద్దల పొదుపు పథకం (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌) కింద ఆర్జించే వడ్డీ రాబడిపై ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక సూచించింది. దీనివల్ల ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని పేర్కొంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) కింద ఒకరు రూ.15 లక్షలను గరిష్టంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. కాకపోతే 60 ఏళ్లు, ఆ పైన వయసున్న వారికే ఇందుకు అనుమతి ఉంటుంది. దీనిపై 8.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతీ త్రైమాసికానికి ఓసారి వడ్డీ చెల్లింపు ఉంటుంది.

ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు, ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ఇందులో పెట్టుబడికి రూ.1.50 లక్షల వరకు సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. అయితే, ఈ పథకంలో డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు ప్రస్తుతం లేదు. ఇది ఈ పథకానికి ఉన్న ఒక ప్రతికూలత. ‘‘ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే రాబడికి పూర్తి పన్ను రాయితీ ఇవ్వడం మంచిది. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం కేవలం రూ.3,092 కోట్లు మాత్రమే. ప్రభుత్వ ద్రవ్యలోటుపై ఇది 2 బేసిస్‌ పాయింటు మాత్రమే’’ అని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని బ్యాంకులు ఆర్‌బీఐ రేట్ల కోతతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడాన్ని చూస్తూనే ఉన్నాం. అటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోని ఇతర పథకాలపై వడ్డీ రేటుతో చూసుకున్నా కానీ, ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకంలో వడ్డీ రేటు పెద్దలకు సంబంధించి ఆకర్షణీయమైనదిగా ఉంది.

4.1 కోట్ల ఖాతాలు: దాదాపు 4.1 కోట్ల సీనియర్‌ సిటిజన్‌ టర్మ్‌ డిపాజిట్‌ ఖాతాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిల్లోని మొత్తం డిపాజిట్లు రూ.14 లక్షల కోట్లు. దేశ జీడీపీలో 7 శాతానికి సమానం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top